విజయనగరం : వైసీపీ నుంచి స్వాతంత్య్రం కావాలంటున్న నారా భువనేశ్వరికి ఎక్కడ ఇబ్బంది కలిగిందో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సభలు పెట్టుకుంటున్నారు కదా.. ఆ స్వాతంత్య్రం సరిపోదా అని ప్రశ్నించారు. విజయనగరంలో ఉప సభాపతి వీరభద్రస్వామి నివాసంలో బొత్స విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలకు చెప్పిందే చేశాం. నాలుగున్నరేళ్లలో చేసిందే చెప్తాం. అందుకే సామాజిక సాధికార యాత్ర చేపట్టామన్నారు. టీడీపీలా మోసగించే మాటలు చెప్పబోమన్నారు. 2014లో టీడీపీ , జనసేన, బీజేపీ విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో 650 హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. మళ్లీ ఆరు వాగ్దానాలతో టీడీపీ , జనసేన ముఠా వస్తోందని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజమహేంద్రవరం జైల్లో తనకు ప్రాణహాని ఉందని చంద్రబాబు రాసిన లేఖపై బొత్స మాట్లాడుతూ ఆయన ఏదైనా రాస్తారన్నారు.