అంబేద్కర్ స్మృతివనం పనులను వేగవంతం చేయాలి
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష
విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సమగ్రంగా సమీక్షించిన సీఎం
గుంటూరు : నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. యస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ముగిసి, పనుల సీజన్ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, ఒక డ్రైవ్ కింద తీసుకుని రోడ్లపై దృష్టిపెట్టాలన్నారు. సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్ చేసి వినియోగించేలా చూడాలన్న ముఖ్యమంత్రి దీనివల్ల చాలావరకు తాగునీటిని ఆదా చేయగలుగుతామని చెప్పారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. విశాఖ నగరంటో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.
ఒక్క విశాఖ నగరంలోనే నాలుగేళ్లకాలంలో రూ.3592 కోట్ల మేర రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా, వీధిలైట్లు, పార్కులు, వాటర్ బాడీలు, సుందరీకరణ, మురుగునీటి శుద్ధి, వివిధ భవనాల నిర్మాణం, పౌరులకు సేవలకోసం ఖర్చుచేసినట్టు అధికారులు తెలిపారు. విశాఖ నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రానురాను జనాభా పెరుగుతున్నందున పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ముడసర్లోవలో నిర్మించనున్న జీవీఎంసీ నూతన భవన నిర్మాణ వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రూ.100 కోట్లతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయ నిర్మాణం జరగనుంది. రూ.300 కోట్లతో విశాఖ నగరంలో మౌలిక సదుపాయాలు కల్పనా ప్రాజెక్టు కింద త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీనికింద ముడసర్లోవ పార్క్ అభివృద్ధి, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ లెవల్ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణం. వీఎంఆర్డీఏ కింద నడుస్తున్న పలు పనుల ప్రగతిని సీఎంకు అధికారులు తెలిపారు.
విజయవాడలో అభివృద్ధిపనుల పురోగతిని అధికారులు వివరించారు. అంబేద్కర్ స్మృతివనం పనులను వేగవంతం చేయాలని, కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. పార్క్‌లో గ్రీనరీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, విజయవాడలో కాల్వలు, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అత్యాధునిక యంత్రాలను దీనికోసం వినియోగించుకోవాలని, విజయవాడ విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న సీఎం విజయవాడలో కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణగోడ వద్ద సుందరీకరణ పనులను కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎంకు అధికారులు వివరించారు. కంబాల చెరువు సహా వివిధ ప్రాంతాల్లో సుందరీకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రాజమండ్రి హేవ్‌లాక్ బ్రిడ్జి సుందరీకరణ సహా ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని, వరదల కారణంగా నెల్లూరు మునిగిపోయే పరిస్థితులు రాకుండా రక్షణ గోడ నిర్మాణం పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం కోరారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను ఏర్పాటుచేసి వారిద్వారా నిర్వహణ చేయాలని, జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సీఎం కోరారు. నగరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నాం. ప్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఎస్టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం అత్యాధునిక యంత్రాలు తదితర వాటిని వివిధ ప్రాజెక్టుల కింద తీసుకువస్తున్నాం. వీటి నిర్వహణ అన్నది చాలా ముఖ్యం, లేకపోతే అవి మూలనపడతాయి. వాటి నిర్వహణకోసం అవసరమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న మానవవనరుల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల్లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకోసం అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధిచేయాలని, ఈ ప్రాజెక్టుల నిర్వహణకోసం ప్రత్యేక ఎస్ఓపీ కూడా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అర్భన్ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బి సుబ్బారావు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ జె విద్యుల్లత, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.