వసుంధరకు దియా ప్రత్యామ్నాయం కాగలరా?
రాజస్థాన్‌లో బీజేపీ మాస్టర్ ప్లాన్
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. రాజస్థాన్ లో ప్రజలు వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరాటంతో చెరో అయిదేళ్లు అధికారాన్ని పంచుకుంటున్నాయి. పార్టీ విజయాల్లో స్వింగ్ స్థానాలే కింగ్ మేకర్స్‌గా మారి అధికారంలోకి ఎవరు రావాలో నిర్ణయిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఈ స్వింగ్ స్థానాల్లో ఏ పార్టీకి ఎలా ఉంది ? ఈ సారి ఓటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారు ?.
రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 166 నియోజకవర్గాల్లో ఓటరు నాడి పట్టుకోవడం కష్టంగా మారింది. ప్రతీసారి ఆ నియోజకవర్గాల్లో ప్రజలు పార్టీని మార్చేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌పై బీజేపీ తన పట్టు ప్రదర్శిస్తోంది. ప్రజల రాజకీయ ప్రాధాన్యాలేంటో తలపండిన రాజకీయ నాయకులకి కూడా అంతుపట్టడం లేదు. 2008లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించినా 2018లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్నప్పటికీ స్వింగ్ స్థానాలు మాత్రం రాజస్తాన్ రాజకీయాల్లో వైల్డ్ కార్డులుగా మారాయి. 2018లో స్వింగ్ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలు కూడా తమ ఉనికిని చాటాయి. ఎవరి ఊహకు అందని విధంగా 12 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తే, బీఎస్పీ రెండు స్థానాలు, సీపీఎం ఒక్క స్థానాన్ని దక్కించుకున్నాయి.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతాపార్టీలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న వసుంధరా రాజేకు తొలి జాబితాలో బీజేపీ అభ్యర్థిత్వం ఖరారు చేయలేదు. రాజేకు, ఆమె మద్దతుదారులకు రెండో జాబితాలో చోటు కల్పించింది. ఈ క్రమంలో వసుంధరా రాజేకు ప్రత్యామ్నాయంగా దియా కుమారిని చూపించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. దియా కుమారి ఎవరు? అసలు రాజస్థాన్ బీజేపీలో ఏం జరుగుతోంది.
రాజస్థాన్‌లో రాచరిక వ్యవస్థ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. రాజకుటుంబ నేపథ్యంతో వసుంధరా రాజే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అయితే ఆమెకు అధిష్ఠానం, ఆరెస్సెస్‌తో విబేధాలున్నాయి. అందుకే ఆమెను కొన్నేళ్లుగా బీజేపీ అధినాయకత్వం పక్కన పెట్టింది. ఆమెకు ప్రత్యామ్నాయంగానే ప్రముఖ రాజ కుటుంబానికి చెందిన దియాకుమారిని తెరమీదకు తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్‌సమంద్ లోక్‌సభ ఎంపీగా ఉన్న దియా కుమారిని ఆగమేఘాల మీద అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ దింపింది. ప్రతిష్ఠాత్మక విద్యాధర్‌నగర్ నుంచి పోటీకి నిలిపింది. రాష్ట్రంలో పార్టీని దశాబ్దాలుగా బలోపేతం చేసిన భైరాన్ సింగ్ షెకావత్ వారసత్వమైన నర్పత్ సింగ్‌ను కాదని ఆ స్థానాన్ని దియాకు కట్టబెట్టింది.
వసుంధరా రాజే 2003లో సీఎం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ఆర్ఎస్ఎస్తో విభేదాలు ఉన్నాయి. రాజేకు ప్రత్యామ్నాయంగా వేరొకరిని సిద్ధం చేయాలని ఆర్ఎస్ఎస్ యోచిస్తోంది. అదే సమయంలో బీజేపీలో అత్యున్నత నిర్ణయాధికారం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షాతోనూ రాజేకు సంబంధాలు నామమాత్రమే. ఇదే సమయంలో దియా కుమారి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నా బీజేపీ కార్యాలయ నిర్మాణానికి ఆమె సొంత స్థలాన్ని ఇచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ జైపుర్‌లో నిర్వహించిన పరివర్తన్ యాత్రను ఆమె ముందుండి నడిపించారు. ఈ క్రమంలో ఆమెనే రాజేకు ప్రత్యామ్నాయంగా ఉంచాలని అధిష్ఠానం యోచిస్తోంది.
వసుంధరా రాజే, దియా కుమారి ఇద్దరూ ప్రముఖ రాజకుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే రాజేకు ఉన్న రాజకీయ అనుభవం దియా కుమారికి లేదు. ఆమె రాజకీయ మూలాలు కాంగ్రెస్‌లో ప్రారంభమయ్యాయి. దియా ఇప్పటి వరకు కేవలం 2 సార్లే అంటే 2013 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు. దియా వ్యక్తిగత జీవితం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. దియా అనుచిత వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు. దియా 1990లో ప్రేమవివాహం చేసుకున్నారు. దీనిపై కుటుంబం నుంచే కాక రాజ్‌పుత్ సంస్థల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాదాపు 10 ఏళ్లు వైవాహిక జీవితం గడిపిన ఆమె 2019లో విడాకులు తీసుకున్నారు. దియా కుమారిని బీజేపీలోకి తీసుకొచ్చింది వసుంధరా రాజేనే. 2013 ఎన్నికల సమయంలో మోదీ నిర్వహించిన ర్యాలీలో దియా కుమారిని ఆయనకు పరిచయం చేసి రాజే టికెట్ ఇప్పించారు. పలు అనూహ్య పరిస్థితుల వల్ల క్రమంగా వారిద్దరి మధ్య వైరం పెరిగిపోయింది.
స్వింగ్ ఎందుకు కింగ్ ? : స్వింగ్ స్థానాల్లో ఓటరు ఒక్కోసారి ఒక్కో రకంగా తీర్పు ఇస్తూ ఉండడంతో ఆ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం రాజకీయపార్టీలకు అనివార్యంగా మారింది. ఎన్నికల వ్యూహాలన్నీ ఆ స్థానాల ప్రాధాన్యాలకనుగుణంగానే రచిస్తున్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు రచించడం అత్యంత కీలకంగా మారింది. ఈ స్థానాల్లో వచ్చే ఫలితాలే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుంటాయి. 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే భారతీయ జనతా పార్టీ 28 నియోజకవర్గాల్లో వరుసగా నెగ్గుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అయిదు స్థానాల్లో వరుసగా విజయం సాధిస్తూ వచ్చింది. 2008లో స్వింగ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా నిలిస్తే 2013 ఎన్నికల నాటికి బీజేపీ పూర్తిగా తన పట్టు బిగించింది. ఇంచుమించుగా క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ మళ్లీ పుంజుకున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు అధికంగా విజయం సాధించడం చూస్తుంటే ఓటర్లు స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఈ సారి ఈ స్వింగ్ స్థానాల్లో పట్టు బిగించి కింగ్‌లా మారాలని తహతహలాడుతున్నాయి.