వ్యతిరేక ఓటుపైనే కాంగ్రెస్ ఆశలు
మిజోరంలో ఒకసారి అధికారం చేపట్టిన పార్టీ వరుసగా రెండోసారి కూడా అధికారం నిలబెట్టుకునే సంప్రదాయం ఉండటం మిజో నేషనల్ ఫ్రంట్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఆ ఆనవాయితీని బద్దలుకొట్టి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మిజోరంలో తొలి సారి పాగా వేయాలని జెడ్ పీ ఏం వ్యూహరచన చేస్తున్నాయి. ఒక సారి మెజార్టీ సాధించిన పార్టీ రెండోసారి అధికారం నిలబెట్టుకునే సంప్రదాయం ఈ సారి కూడా కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి.
క్రిస్టియానిటీ మెజార్టీ ఉన్న మిజోరంలో ఈ సారి అధికార కోసం మిజో నేషనల్ ఫ్రంట్-, కాంగ్రెస్, జెడ్ పీ ఏం మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మిజోరంలో ఒక సారి అధికారం చేపట్టిన పార్టీ వరుసగా రెండు విడతలు అధికారంలో ఉండటం ఆనవాయితీగా వస్తోంది. 1987లో మిజోరం రాష్ట్ర హోదా పొందిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో స్వతంత్రుల మద్దతుతో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారం చేపట్టింది. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. 1994 లోనూ ఆ పార్టీ అధికారం నిలబెట్టుకుంది. 1998, 2003లో మిజో నేషనల్ ఫ్రంట్ గద్దెనెక్కగా 2008, 2013లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలో దక్కించుకుంది. 2018లో మిజో నేషనల్ ఫ్రంట్‌కు అధికారం బదిలీ అయింది. మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా 3 పార్టీలు అన్ని చోట్ల తమ అభ్యర్థులను బరిలో దించాయి. మిజో నేషనల్ ఫ్రంట్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 39 స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ ఒకచోట మాత్రమే గెలుపొందింది. ఈ సారి 23 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో దించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మిజోరం ఎన్నికల్లో అరంగేట్రం చేస్తోంది. తొలిసారి కావటం వల్ల 4 స్థానాల్లోనే అభ్యర్థులను నిలబెట్టింది.
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మిజోరం ఎన్నికల బరిలో 174 మంది మిగిలారు. వారిలో 27 మంది స్వతంత్రులు సహా 5 పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. 16 మంది మహిళలు కూడా ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. 2018 లో కంటే ఈ సారి 35 మంది తక్కువగా పోటీ చేస్తున్నారు. మిజోరంలో మొత్తం 8 లక్షల 56 వేల 8 వందల 68 మంది ఓటర్లు ఉన్నారు. మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. డిసెంబర్ 3 ఆదివారం కావడం వల్ క్రిస్టియన్లు ప్రార్థనలకు వెళ్తారని ఓట్ల లెక్కింపు తేదీ మార్చాలని అన్నిపార్టీలు, చర్చీలు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేశాయి. అయితే వారి అభ్యర్థనపై ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.