మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్
మామాఅల్లుళ్లే ప్రత్యర్థులు
బావామరదళ్ల మధ్య ఢీ
పరి’వార్’లో విజయమెవరిదో?
హైదరాబాద్ : దేశంలో 2024 లోక్‌సభ సమరానికి ముందు కీలకమైన మధ్యప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. మరి మధ్యప్రదేశ్‌లో ప్రధాన పార్టీల పరిస్థితేంటి? కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీతో అధికారం కట్టబెడతారా? బీజేపీకి జై కొడతారా?. మధ్యప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికల పోరు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్టుగా మారింది. అధికారం నిలబెట్టుకోవాలని కమలం పార్టీ, ఈసారి ఎలాగైనా పాలనా పగ్గాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చి ప్రత్యర్థులుగా బరిలో నిలిపాయి.
మధ్యప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబాల మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది. హోషంగాబాద్ నియోజకవర్గంలో అన్నదమ్ములు సయ్యంటే సయ్యంటున్నారు. డియోతలాబ్ నియోజకవర్గంలో మామాఅల్లుళ్లు బస్తీమే సవాల్ అంటున్నారు. డబ్రా నియోజకవర్గంలో ఇద్దరు దగ్గరి బంధువుల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. సాగర్ నియోజకవర్గంలో బావామరదళ్లు తలపడుతున్నారు. మరి వారెవరు? వారి రాజకీయ పరిస్థితేంటి?. అన్నదమ్ములే ప్రత్యర్థులు : హోషంగాబాద్ నియోజకవర్గం మూడు దశాబ్దాల నుంచి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉంది. అన్నదమ్ములైన గిరిజా శంకర్‌శర్మ, సీతా శరణ్ శర్మ ఈసారి బీజేపీ, కాంగ్రెస్ తరపున ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. 73 ఏళ్ల గిరిజా శంకర్ 2003, 2008 ఎన్నికల్లో కమలం తరఫున రెండుసార్లు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంపై ఆయనకు గట్టిపట్టు ఉంది. ఆయన తమ్ముడు 69ఏళ్ల సీతా శరణ్ కూడా ఇదే నియోజకవర్గం నుంచే బీజేపీ తరఫున 1990, 1993, 1998, 2013, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2018 ఎన్నికల నుంచి అన్నదమ్ముల మధ్య విరోధం మొదలైంది. 2018 ఎన్నికల్లో తొలుత గిరిజా శంకర్‌ను తమ అభ్యర్థిగా నామినేట్ చేసిన బీజేపీ.. తర్వాత నిర్ణయం మార్చుకొని సీతా శరణ్‌కు టికెట్ కేటాయించింది. గిరిజా శంకర్ 2023 సెప్టెంబర్‌లో మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. హోషంగాబాద్‌లో బీజేపీ తరపున సీతా శరణ్ పోటీ చేస్తుండగా ఆయన సోదరుడు గిరిజా శంకర్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది.
మామాఅల్లుళ్ల సవాల్ : డియోతలాబ్ నియోజకవర్గంలో మామాఅల్లుళ్లు బస్తీమే సవాల్ అంటున్నారు. బీజేపీ తరపున గిరీశ్ గౌతమ్, కాంగ్రెస్ తరపున పద్మేశ్ గౌతమ్ రంగంలో ఉన్నారు. వారిద్దరూ మామాఅల్లుళ్లు. 70ఏళ్ల గిరీశ్ గౌతమ్ నాలుగుసార్లు డియోతలాబ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత సీపీఐ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన తర్వాత కాలంలో బీజేపీలో చేరారు. 2003 ఎన్నికల్లో తొలిసారి మంగవాన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే ఆ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించడం వల్ల 2008లో డియోతలాబ్ స్థానానికి మారారు. 2008, 2013, 2018 ఎన్నికల్లో అక్కడి నుంచి గెలుపొందారు. వివిధ రాజకీయ కారణాలతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవటం వల్ల బీజేపీ అధికారం చేపట్టాక 2020 ప్రారంభంలో అసెంబ్లీ స్పీకర్‌గా సేవలందించారు. పద్మేశ్ గౌతమ్ ఆయనకు స్వయాన మేనల్లుడు. 9ఏళ్లక్రితం కాంగ్రెస్‌లో చేరారు. వారిద్దరూ ప్రత్యర్థులుగా మారడానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 2020లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ గిరీశ్ గౌతమ్ తనయుడు రాహుల్‌ను పద్మేశ్ గౌతమ్ ఓడించారు.
దగ్గరి బంధువుల మధ్య పోరు : డబ్రా నియోజకవర్గంలో ఇద్దరు దగ్గరి బంధువుల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేశ్ రాజేతో బీజేపీ నుంచి ఇమర్తి దేవి తలపడుతున్నారు. వారిద్దరూ దగ్గరి బంధువులు. ఇమర్తి దేవి అన్నయ్య కుమార్తెను సురేశ్ రాజే కుమారుడు వివాహం చేసుకున్నారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విధేయురాలిగా గుర్తింపు పొందిన ఇమర్తిదేవి ఎక్కువకాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. డబ్రా నుంచి 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈమె 2020 వరకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. అయితే 2020లో జ్యోతిరాదిత్య సింధియా తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరడం వల్ల ఇమర్తిదేవి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ రాజే చేతిలో ఓడిపోయారు. అంతకుముందు బీజేపీలో ఉన్న సురేశ్ రాజె తన ప్రత్యర్థి ఇమర్తిదేవి పార్టీలోకి రావడం వల్ల ఉప ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2013 ఎన్నికల్లో సురేశ్ రాజెపై ఇమర్తి దేవి గెలుపొందారు. వారిద్దరు మూడోసారి ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఆసక్తి రేపుతోంది.
బావామరదళ్ల మధ్య ఢీ : సాగర్ నియోజకవర్గంలో బావామరదళ్లు తలపడుతున్నారు. కాంగ్రెస్తరపున నిధీ జైన్ పోటీ చేస్తుండగా ఆమె బావ శైలేంద్ర జైన్ బీజేపీ తరఫున సమరానికి సై అంటున్నారు. శైలేంద్ర జైన్ సోదరుడు సునీల్ జైన్ భార్యే నిధీ జైన్. ఈ స్థానం నుంచి శైలేంద్ర జైన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బావామరదళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఎన్నికల్లో తలపడుతుండటం వల్ల అందరి దృష్టి సాగర్ నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. కుటుంబ సభ్యుల మధ్య పోరుతో మధ్యప్రదేశ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. మధ్యప్రదేశ్‌లో నెలకొన్న ఈ కుటుంబాల మధ్య పోరులో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.