కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన నిర్ణయం
బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
ఎల్లుండి హస్తినలో సోనియా, రాహుల్ సమక్షంలో హస్తం గూటికి
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గంట గంటకూ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎప్పుడేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి బీఫామ్‌లు కూడా ఇచ్చేసి, మేనిఫెస్టో ప్రకటించి హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ శంఖారావం పూరించారు. ఇక అంతకుముందు నుంచే జాతీయ స్థాయి నేతలతో కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. మొదటి జాబితాను రిలీజ్ చేసిన హస్తం త్వరలో మిగిలిన అభ్యర్థులతో రెండో జాబితా రిలీజ్‌కు రంగం సిద్ధం చేస్తోంది. ఇక బీజేపీ కూడా తొలి జాబితాను రిలీజ్ చేసింది అయితే ఇందులో సీనియర్లు, ఆశావాహుల పేర్లు లేకపోవడం పలు అనుమానాలు, అంతకుమించి ఊహాగానాలకు తెరలేపుతోంది.
అసలేం జరుగుతోంది..? : బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఎక్కడా సీనియర్లు, కీలక నేతలు.. ఆఖరికి రాష్ట్ర అధ్యక్షుడి పేరు కూడా లేకపోవడం గమనార్హం. పోనీ రెండో జాబితాలో అయినా పేరు ఉంటుందా అంటే అది కూడా ప్రశ్నార్థకమేనని తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లు దూరంగా ఉండటంతో ఈ వ్యవహారం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈసారి బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీగా తలపడుతుండటంతో మధ్యలో దూరి బద్నాం కావడం అవసరమా..? కచ్చితంగా ఫలితాలు నెగిటివ్‌గానే ఉంటాయని, ఓటమి భయంతోనే సీనియర్లు పోటీకి దూరంగా ఉంటున్నారని కాషాయ పార్టీలో అనుమానాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్వయంగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంపై ఊహాగానాలు పెరిగిపోయాయి. సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ ) కూడా పోటీకి దూరంగా ఉండటం ఈ వరుస పరిణామాలతో కమలం పార్టీలో ఏం జరుగుతోందో కార్యకర్తలు, పార్టీ నేతలకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
పోటీకి ఎందుకీ దూరం : కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లే పోటీకి దూరంగా ఉండటంతో తాను కూడా అదేబాటలో వెళ్తున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో అన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయన కాషాయ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పకొనే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిస్థితి కూడా ఇలానే ఉంది. తొలిజాబితాలో అరుణ పేరూ లేదు. పోటీకి ఆసక్తి చూపట్లేదు. కారణాలేంటి అనేది తెలియట్లేదు కానీ బీసీలను ప్రోత్సహించేందుకు బలమైన బీసీ నేతను బరిలోకి దింపుతానని చెబుతున్నారు. ఇక మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విషయానికొస్తే తనకు బదులుగా కుమారుడికి మహబూబ్‌నగర్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక విజయశాంతి అలియాస్ రాములమ్మ అయితే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి తొలగించడం, ఈటల రాజేందర్‌కు పార్టీలో ప్రాధాన్యం కల్పించడంతో మౌనవ్రతంలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే కామారెడ్డి నుంచి పోటీచేసే అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్‌పై పోటీచేస్తానని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్లు పోటీ చేయకపోవడంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద చర్చే నడుస్తోంది. సీనియర్లు పోటీ నుంచి తప్పుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కేడర్ ఆందోళన చెందుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలేం జరుగుతోందో తెలియక సీనియర్లు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కాక బీజేపీ శ్రేణులు, నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. రెండో జాబితా వచ్చిన తర్వాత అసలు సంగతేంటో తెలిసిపోనుంది.
రాజగోపాల్‌రెడ్డి సంచలన నిర్ణయం : అసెంబ్లీ ఎన్నికల వేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం పార్టీకి గట్టి షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతోనే ఆయన పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రాజగోపాల్‌రెడ్డి బీజేపీ రాజీనామాను ప్రకటించారు. మళ్లీ ఆయన సొంత గూటికే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి హస్తినలో సోనియా, రాహుల్ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు. 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతర పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కాషాయం గూటికి చేరారు. తర్వాత జరిగిన మునుగోడు బైపోల్స్‌లో బీజేపీ నుంచి పోటీ చేసి అపజయం మూటగట్టుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన బీజేపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తూ ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
లేఖలో ‘‘కేసీర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. నాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినా, నేడు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదు, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డాను. నియంత కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న నన్ను ఆదరించాలని రాష్ట్ర ప్రజలని కోరారు.