సాంకేతిక విద్యాశాఖ నేతృత్వోంలో అకాడమీ, పరిశ్రమ భాగస్వామ్య పురోగతిపై రాష్ట్ర స్దాయి సదస్సు
అరవై శాతం విద్యార్ధులకు తక్షణ ఉపాధి చూపటం ద్వారా రికార్డు : చదలవాడ నాగరాణి
విజయవాడ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడానికి పరిశ్రమ-అకాడమీ మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని నైపుణ్యాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక ఉండాలని, విద్యార్థులు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలను కూడా పొందగలిగేలా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. పరిశ్రమలు, విద్యారంగాల మధ్య సంబంధాల బలోపేతం ధ్యేయంగా సాంకేతిక విద్యాశాఖ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లకు చెందిన ప్రిన్సిపాళ్లు, ట్రైనింగ్, ప్లేస్ మెంట్ అధికారులకు గురువారం సదస్సు నిర్వహించింది. ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ కుమార్ మాట్లాడుతూ మంచి విధ్యా బోధనకు అధ్యాపకుల శిక్షణను తప్పనిసరి చేయాలని, ఇది కేవలం కెరీర్ పురోగతి లేదా పదోన్నతుల కోసం కాకుండా విద్యను సమగ్రంగా పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాంకేతిక విద్య కమీషనర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పాలిటెక్నిక్ ల ముంగిటకు బహుళజాతి కంపెనీలను తీసుకురావడం ద్వారా డిప్లొమా విద్యార్థులకు అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలను అందించడంలో కీలక విజయాలను సాధించామన్నారు. పరిశ్రమలతో అవగాహన ఒప్పందాల అమలు, పాఠ్యప్రణాళిక పునరుద్ధరణలో పరిశ్రమల భాగస్వామ్యం, ఫ్యాకల్టీ ఇండస్ట్ వంటి పరిశ్రమల అనుసంధాన కార్యక్రమాల నిర్వహణతో అర్ధవంతమైన సాంకేతిక విద్యను అందించామన్నారు. మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 60 శాతం మంది విద్యార్ధులకు ఈ సంవత్సరం ఉపాధిని చూపామన్నారు. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హాజరుకాగా డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ కెఎన్ లక్ష్మీపతి మాట్లాడుతూ ఇండస్ట్రీ-అకాడమీ సహకారం యొక్క కీలక పాత్రను గుర్తించి పాలిటెక్నిక్ అధ్యాపకులకు నెల రోజుల పాటు పారిశ్రామిక శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. సుజ్లాన్ గ్లోబల్ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ జనరల్ మేనేజర్ మరియప్పన్ మాట్లాడుతూ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంపొందించడానికి విద్యారంగం, పరిశ్రమల మధ్య సహకారం అవసరమని నొక్కి చెప్పారు. హెస్ట్ అల్లాయ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ ఫౌండ్రీ రంగంలో డిప్లొమా విద్యార్థులకు అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమ, విద్యా వ్యవస్ధల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ లేకుండా చూడాలన్నారు. పరిశ్రమ-విద్యా సహకారాన్ని సులభతరం చేయడంలో అమూల్యమైన మద్దతు ఇచ్చినందుకు – వీల్స్ ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్, హెచ్ఎల్ మండో ఆనంద్, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ సంస్ధలకు ఇండస్ట్రీ కనెక్ట్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు. ప్లేస్ మెంట్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాలిటెక్నిక్ లకు బెస్ట్ ప్లేస్ మెంట్ పెర్ఫార్మర్ గా గుర్తించి అవార్డులు ప్రదానం చేశారు. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ {నంద్యాల}, ప్రభుత్వ పాలిటెక్నిక్ {విజయవాడ}, ప్రభుత్వ పాలిటెక్నిక్ {విశాఖపట్నం}, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ {విశాఖపట్నం}, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ {గుంటూరు}, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ {రాజమండ్రి}, ప్రభుత్వ పాలిటెక్నిక్ {అనకాపల్లి}, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ {సూరంపాలెం} వరుసగా తొలి ఎనిమిది స్ధానాలను దక్కించుకున్నాయి. వెబ్ సైట్ డిజైన్ కాంపిటీషన్ లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్-భీమునిపట్నం విధ్యార్దుల బృందం విజేతగా నిలిచి రూ.50,000 నగదు బహుమతిని పొందారు. ఏఐసీటీఈ ప్రగతి, సాక్షం, స్వానత్ స్కాలర్ షిప్ ల వివరాలతో కూడిన సమాచార పోస్టర్ ను సైతం ఆవిష్కరించారు. వర్క్ షాప్ లో జాయింట్ డైరెక్టర్ వి.పద్మారావు, ఆర్జేడీ-ఏయూ రీజియన్ జె.సత్యనారాయణమూర్తి, ఆర్జేడీ-ఎస్వీయూ రీజియన్ ఏ.నిర్మల్ కుమార్ ప్రియ, ఎస్ బీటీఈటీ కార్యదర్శి కేవీ రమణబాబు అధికారులు పాల్గొన్నారు.