విజయవాడ సిపిటి పరీక్షకు కారుణ్య నియామక టైపిస్టులను కూడా అనుమతించాలని ఏపిజెఏసి అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏ.పి.పి.యస్.సి సెక్రటరి జె. ప్రదీప్ కుమార్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కారుణ్యనియామాకాల కోటాలో నియమించబడి, టైపింగ్ టెస్టులు పాస్ కానందున ప్రస్తుతం టైపిస్టులుగానే పనిచేస్తున్న వారు కంప్యూటర్ ప్రోఫిషియేన్సీ టెస్టు (సిపిటి) పాసైతే చాలని ఇటీవల ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి ఆధ్వర్యంలో చేపట్టిన 92 రోజుల ఉద్యమంలో పెట్టిన డిమాండ్ మేరకు ప్రభుత్వం అంగీకరించి జిఓ నెం. 69 జి ఏ డీ 27-07-23 ద్వారా ఆదేశాలు ఇచ్చింది. అయితే గత మూడు రోజుల క్రితం, ఏ.పి.పి.యస్.సి వారు నోటిఫికేషన్ 9/2023 ద్వారా ఇచ్చిన ఆదేశాలమేరకు “సిపిటి టెస్టు రాసుకొనేందుకు విలేజ్ వార్డు సెక్రటరీలకు, విఆర్ఓ (గ్రేడ్-2), పంచాయితీ సెక్రటరీ గ్రేడ్-5 లకు అవకాశం కల్పించారు. కానీ సదరు నోటిఫికేషన్ లో టైపిస్ట్ కేటగిరీ ప్రస్తవించలేదు. ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జిఓ నెం 69 ద్వారా టైపింగ్ టెస్టులు పాస్ కానివారికి సిపిటి పరీక్ష పాస్ అయితే చాలు అని ఉత్తర్వులు ఇచ్చి యున్నందున (జిఓ 69), వారు సీపీటీ పరీక్ష పాస్ అయితే తప్ప వారి ప్రొబేషన్, పదోన్నతులు లభించవన్నారు. టైపిస్టులకు కూడా ఈ సిపిటి ఎగ్జామినేషన్ లో పాల్గోనేందుకు అవకాశం కల్పించేలా ఇదే నోటీఫికేషన్ 9/2023 ద్వారా ఆదేశాలు ఇచ్చి టైపిస్టులకు కూడా న్యాయం జరిగేలా చూడాలని గురువారం ఏ.పి.యస్.సి సెక్రటరీ జె. ప్రదీప్ కుమార్ ని కలసి ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశం టైపిస్టుకు కల్పించడం వల్ల ఈ టెస్టు పాసైతే గతంలో కారుణ్యనియామాకాలలో జాయిన్ అయిన టైపిస్టులందరికీ వారు జాయిన్ అయినప్పటి నుండి సీనియారిటీ వర్తించి అందరికీ న్యాయం జరుగుతుందని విజ్ఞప్తిచేయగా దీనిపై ఏ. పి పి.యస్. సి సెక్రటరీ కూడా సానుకూలంగా స్పందిస్తూ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర రావు తెలిపారు. ఈసమావేశంలో ఏపి మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ దొప్పలపూడి కూడా పాల్గొన్నారు.