అనంతపురం : రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఇంచార్జ్లు, నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర -వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహణపై మంత్రి సమీక్ష చేశారు. కార్యక్రమాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాజిక న్యాయ బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను మూడు ప్రాంతాలుగా విభజించి షెడ్యూల్ ఖరారు చేశామన్నారు.
ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 9 వరకు 7 రాయలసీమ జిల్లాల్లో 7 సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 26న శింగనమల నియోజకవర్గం నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. వైసీపీ నాయకులందరూ పూర్తి స్థాయిలో శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. ‘నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని జగన్ చెప్పే నినాదాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు తమను వాడుకున్నాయని ప్రజలు గుర్తించారన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు, జిల్లా ముఖ్యనాయకులు కూడా బస్సు యాత్రలో పాల్గొంటారని, వైసీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత మేలు చేసిందో వివరిస్తారన్నారు. కృష్ణా జలాలపై న్యాయపోరాటం చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.