అమరావతి : దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులపై భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా మనువాదాన్ని విడనాడలేకున్నారన్నారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి సస్పెండైన ఒక దుర్మార్గపు నాయకుడై అనంతబాబును సామర్లకోటలో సీఎం జగన్ ప్రక్కన ఎలా కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. ఒక మంచి డాక్టర్ సుధాకర్ ఉసురు పోసుకున్న ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిది అంటూ వ్యాఖ్యలు చేశారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రశ్నించిన వర ప్రసాద్‌కు పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టించి అవమానించారని, రాష్ట్రప్రతి లేఖ పంపినా వరప్రసాద్‌కు న్యాయం చేయలేదన్నారు. దళిత యువతిని జగన్ మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఒక రూమ్‌లో బంధించి నాలుగు రోజులు మానభంగం చేస్తే చర్యలు శూన్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.