రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస.జవహర్ రెడ్డి
వెలగపూడి సచివాలయంలో ఏపీ విజన్-2047 రాష్ట్ర స్ట్రాటజిక్ ప్లాన్ పై సిఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం
వెలగపూడి సచివాలయం : 2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం)గా మారాలనే లక్ష్యానికి అనుగుణంగా ఎపి విజన్- 2047 పై రాష్ట్ర స్ట్రాటజిక్ ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస.జవహర్ రెడ్డి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.వచ్చే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజన్-2047 కింద అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు రూపొందించాల్సిన స్ట్రాటజిక్ ప్రణాళిక అమలుపై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం అధికారులకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ నీతి ఆయోగ్ బృందం ఎపి విజన్-2047 కు సంబంధించి మంచి ముసాయిదాను సిద్దం చేసిందని పేర్కొన్నారు.అయితే దాని అమలుకు తగిన నిధులు సమకూర్చుకోవడమే పెద్ద సవాళ్ అని ఇందుకు కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా సహాయం అందించగలిగితే ఎపిని 2047 నాటికి అన్ని రంగాల్లో మెరుగైన రీతిలో అభివృద్ధి పధంలోకి తీసుకురావచ్చని చెప్పారు. వివిధ సెక్టార్ల వారీగా చేపట్టాల్సిన అంశాలపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈనెల మూడవ వారంలో రాష్ట్ర స్థాయిలో వర్క్ షాప్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు.సమాజంలో దారిద్ర్యరేఖకు దిగువనున్నవారికి ఆయుస్మాన్ భారత్ కింద బీమా కల్పిస్తున్న విధంగానే దారిద్య్ర రేఖకు ఎగువనున్న వారికి ఒక బీమా పధకం ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి సిఎస్ జవహర్ రెడ్డి సూచించారు.
ఈ సమావేశంలో నీతి ఆయోగ్ డైరెక్టర్, టెక్నాలజీ టాఫిక్ నిపుణుడు అంకుశ్ వధేరా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ప్రాజెక్టు లక్ష్యాలు , టీం అప్రోచ్ గురించి వివరించారు. ముఖ్యంగా ధీమ్ వారీ విజన్, మాక్రో గోల్స్ పై వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తీర ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటక రంగం, షిప్ బిల్డింగ్ వంటి రంగాల్లో అభివృద్ధికి గల అవకాశాలపై వివరించారు.అదే విధంగా వ్యవసాయ,ఉద్యానవనం తోపాటు ఆక్వాకల్చర్ రంగాల్లో భారత దేశంలోనే ప్రముఖ హబ్ గా ఉన్న ఎపిని రానున్న రోజుల్లో ఈరంగాల్లో మరింత అభివృద్ధి చేయడం ద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.అదే విధంగా హై వాల్యూ ఇండస్ట్రియల్ క్లస్టర్లు,నెక్ట్స్ జనరేషన్ సర్వీస్ హబ్, పట్టణాలు,నగరాల్లో ఆర్ధిక,సామాజికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ఆవశ్యకత వంటి అంశాలపై వివరించారు.ఇంకా వివిధ ధీమ్ ల వారీగా తీసుకోవాల్సిన చర్యలు ఇతర అంశాలపై ఆయన వివరించారు.
తొలుత ఈసమావేశానికి రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి గిరిజా శంకర్ స్వాగతం పలికారు.ఇంకా ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్,ఆశాఖ కమీషనర్ సురేశ్ కుమార్,వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ జె.నివాస్,నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం నీతి ఆయోగ్ అడ్వయిజర్(పిపిటి)సిహెచ్.పి.సారధి రెడ్డి,డైరెక్టర్ డా.శశాంక్ షా,ప్రాజెక్టు లీడ్ అభిషేక్ గుప్తా,ప్రాజెక్టు కో-లీడ్ కేశవ్ డామిని,స్పెషలిస్ట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ బిలాప్ నాందే,కన్సల్టెంట్లు షివిల్ అగర్వాల్,సుచేత్ కుమార్,స్వరూప్ పాల్గొనగా వీడియో లింక్ ద్వారా ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్,టిఆర్అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్న ఇతర అధికారులు పాల్గొన్నారు.