మంగళగిరి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రయివేటు మరియు ప్రభుత్వ విద్యాసంస్థలు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ప్రకటించిన దసరా పండుగ సెలవులు ను తప్పని సరిగా పాటించి తీరాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు. ఈ దసరా సెలవుల్లో విద్యా సంస్థలు తరగతులు నిర్వహించినా , ఆన్లైన్ తరగతులు నిర్వహించినా తప్పక పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో సెలవుల విషయములో ప్రభుత్వ నియమ నిబంధనలను కొన్ని ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలు పాటించడం లేదని కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోమ్ వర్కులు చేయమని బాలలకు ఒత్తిడి తీసుకొని వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ అయినా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారి మెయిల్ కి apscpcr2018@gmail.com కు మెయిల్ ద్వారా పిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే మండల ,జిల్లా స్థాయి విద్యా శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల చైర్ పర్సన్ కేసలి అప్పారావు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ విశయం మీద అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.