విజయవాడ : ప్రజల్లో సానుభూతి సంపాదించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు రోజుకో డ్రామాలాడుతున్నారని వైసీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శించారు. స్కిల్ స్కాం లో వేలకోట్లు అవినీతి కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన రెండు రోజులకే దోమలు కొడుతున్నాయనీ, వేడినీళ్లు లేవని, భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ లేదని, రాత్రి సమయంలో గార్డులు విజిల్స్ వేయడం వల్ల నిద్ర ఉండటం లేదని, డి హైడ్రేషన్ వల్ల నీరసంగా ఉన్నాడని, ఇప్పుడు చర్మ వ్యాధి వచ్చిందని లేని పోని పుకార్లు సృష్టిస్తున్నారన్నారు.
2014 నుండి 2019 వరకు రాష్ట్రంలో కనీవినీ ఎరగని అవినీతిని చేసినా, చంద్రబాబు కొడుకు లోకేష్ మొన్నటి వరకు మీ ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అయ్యింది ఏమి పీకలేక పోయావని విమర్శలు చేశాడని ,పక్కా ఆధారాలతో పోలీసులు అరెస్టు చేస్తే అక్రమ అరెస్టులు అంటూ ఢిల్లీలో ప్రతి గుమ్మం ఎక్కి దిగుతున్నారనీ ఎద్దేవా చేశారు.
హిందూపూర్ లో తెలుగు వారి ఆత్మ గౌరవం సభలు పెట్టి చంద్రబాబు సమక్షంలో బాల క్రిష్ణ ప్రధానమంత్రి మోడీనీ, అమిత్ షాను అనరాని మాటలు అన్న విషయాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని మీ మరిది చంద్రబాబు గురించి రాయబారాలు చేస్తున్నారన్నారు. నాడు తమ్ముడి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర, నేడు మరిది కోసం కేంద్ర హోం మంత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారన్నారు. నోటా నుండి కనీసం కమలం వైపు ఓట్లు వస్తాయి అని రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే టిడిపిని, మరిదిని కాపాడటానికే ఆమే శ్రద్ధ చూపిస్తున్నారని ఆకుల శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు కోసం టిడిపి నాయకులు చేస్తున్న కల్ల బొల్లి ప్రచారాలు నమ్మవద్దని ప్రజలను కోరారు.