అమరావతి : చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ముప్పు ఉందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ‘చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలాడుతోంది. స్కిన్ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జైలు అధికారులు, డాక్టర్ల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలని సజ్జల దుయ్యబట్టారు.
వీరి తాపత్రయం అదే : ‘‘చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపింది. జరిగిన తప్పు మీద టీడీపీ మాట్లాడటం లేదు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. ఏసీ పెట్టమని అడుగుతున్నారు ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే చంద్రబాబు తింటున్నారు. భోజనాన్ని కూడా జైలు అధికారులు పరీక్షించాకే అనుమతిస్తున్నారు. ప్రతీరోజూ చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అర్జంటుగా చంద్రబాబును బయటకు తీసుకొచ్చాయలన్నదే వీరి తాపత్రయమని సజ్జల ధ్వజమెత్తారు. ‘‘జైలులో సకల సౌకర్యాలు ఉండాలనుకుంటున్నారు. కోర్టు చెప్పకముందే జైలు అధికారులు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అమిత్‌షా పిలిపిస్తే లోకేష్ వెళ్లాడని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అమిత్‌షాతో ఏం మాట్లాడారో తెలీదు. కానీ ఎల్లో మీడియా కథనాలు చాలానే అల్లింది. ఏ కోర్టులో ఉంది. ఏ బెంచ్ విచారిస్తోందంటూ అడిగారంట. అమిత్‌షాతో భేటీని వీళ్లకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది. లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేశ్‌కు డబ్బులు అందాయి. పెండ్యాల శ్రీనివాస్‌కు కూడా డబ్బులు అందాయి. పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేశ్ ఇద్దరూ విదేశాలకు జంప్ అయ్యారని సజ్జల పేర్కొన్నారు.
కక్ష సాధింపు చర్యలు మాకు అలవాటు లేదు : చంద్రబాబు కేసులో ప్రభుత్వ జోక్యం లేదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు స్కామ్‌ను వెలికితీశాయి. కక్ష సాధింపు చర్యలు మాకు అలవాటు లేదు. పూర్తి సాక్ష్యాధారాలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు స్కామ్‌ను వెలికితీశాయి. అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికే టీడీపీ ప్రయత్నిస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌కు రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తున్నారని సజ్జల నిప్పులు చెరిగారు.