అమరావతి : రాజమహేంద్రవరం జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్‌దే బాధ్యత. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారు. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫెక్షన్, అలర్జీతో బాధపడుతున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆయనను అపరిశుభ్రమైన జైలులో నిర్బంధించడం హృదయవిదారకం. ఆయన ఆరోగ్యంపై అపరిశుభ్రత తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందట్లేదు. తక్షణ వైద్య సహాయం అవసరమని అన్నారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు రాజమహేంద్రవరంలో జైలుభరో కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.