సొమ్ములు రావడంతో ప్రచారంలో జోరు
ఖచ్చితంగా బరిలో ఉండేవారికి సాయం
పక్క రాష్ట్రం నుంచి అందనున్న నిధులు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలకు నగారా మోగడంతో.. రాష్ట్రంలోని పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు పలు తాయిలాలు, బహుమతులను అందించేందుకు సిద్ధమయ్యాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు. అన్నింటిదీ అదే దారి. అందునా ఈ ఎన్నికల్లో పోటీ మూడు పార్టీల మధ్య ఉండడంతో.. ఎట్టిపరిస్థితుల్లో ఓట్లు చీలకుండా అన్నీ తమకే పడాలన్న దృఢసంకల్పంతో ఉన్నాయి. అందుకోసం ఒకదాన్ని మించి మరొకటి వ్యూహాలు రచిస్తున్నాయి. ఖర్చుకు ఎక్కడా వెనుకాడొద్దని తమ అభ్యర్థులకు సూచిస్తున్నాయి. అయితే గెలుపు రేసులో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఇప్పటివరకూ బీఆర్ఎస్ మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీల్లో సీట్ల కేటాయింపుపై ఇంకా స్పష్టత రాలేదు. 75 స్థానాల్లో తమ అభ్యర్ధులు ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టత వచ్చినా ఇంకా జాబితా ప్రకటించలేదు. మిగతా స్థానాలను కూడా ఖరారు చేశాక, అన్నింటినీ ఒకేసారి ప్రకటించాలని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఇక మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలోనూ ఇదే పరిస్థితి. అయినప్పటికీ పార్టీలన్నీ తమ అభ్యర్ధుల గెలుపునకు అవసరమైన ఆర్థిక వనరులను ఇప్పట్నుంచే సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక ప్రధాన పార్టీ అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అక్కడి పరిస్థితులను బట్టి తొలి విడతగా ‘ఖర్చుల’ నిమిత్తం డబ్బును పంపినట్టు సమాచారం.
ఎన్నికలకు 10 రోజుల ముందు వరకూ నిర్వహించే సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో పాటు ఇతరత్రా ఖర్చుల కోసం ఈ సొమ్మును వాడుకోవాలని, ఎన్నికల వేళకు చేయాల్సిన‘ఖర్చుల’ కోసం అప్పుడు మరికొంత అందిస్తామని ఆ పార్టీ తన అభ్యర్థులకు చెబుతున్నట్టు సమాచారం. దీంతోపాటు జిల్లా పరిస్థితులను పరిశీలించి, అసంతృప్తులు, అసమ్మతివాదులను బుజ్జగించి, వారిని సముదాయించడం కోసం, మరికొన్ని అవసరాల నిమిత్తం కూడా మరికొంతమొత్తాన్ని నిర్ణయించి జిల్లాకొక నేతకు చొప్పున అందిస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తాన్ని ఎన్నికల కోడ్ కూయడానికి ముందుగానే చేర్చినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అధిష్ఠానం నుంచి ఆర్థిక సాయం అందుకున్న అభ్యర్ధులంతా ప్రచార పర్వంలో వేగాన్ని పెంచారు. దీంతో, మిగతా పార్టీలు సైతం ఈ తంతుపై దృష్టి సారించాయి.
అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు కానప్పటికీ ఫలానా నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి బరిలో ఉండడం ఖాయమనుకుంటే వారికి ఆ పార్టీలు కొంత ఆర్థిక సాయం అందిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఒక పార్టీకి దక్షిణ తెలంగాణ సరిహద్దుగా ఉన్న పొరుగు రాష్ట్రం నుంచి నిధులు అందుతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ఇటీవల ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు బిగ్షాట్లు కూడా కొంతమేర ఎన్నికల నిధులను సర్దుబాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరో జాతీయ పార్టీ కూడా నిధుల విషయంలో సమస్య తలెత్తకుండా అధిష్ఠానంతో కీలక చర్చలు జరుపుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా అగ్రనేతలతో రాష్ట్రంలో భారీ సభలు నిర్వహించిన ఆ పార్టీ నిధుల విషయం కూడా ఆ సభల సమయంలోనే చర్చించినట్టు సమాచారం. అయితే ఈ పార్టీకి అవసరమైన నిధులు ఉత్తర తెలంగాణకు సరిహద్దుగా ఉన్న రాష్ట్రం నుంచి అందనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతోపాటు హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక నియోజకవర్గాల ఉప ఎన్నికల సందర్భంగా ఆ పార్టీలోకి చేరిన పలువురు బడా నేతలు కూడా ఎన్నికలకు అవసరమైన ఆర్థిక వనరులను కొంతమేర ఏర్పాటు చేస్తున్నారు.