విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉంది. కానీ అప్పుడే పొత్తులు, సీట్లపై చర్చ సాగుతోంది. కొందరు మరో ముందడుగు వేసి ఈ నియోజకవర్గం నాదే. కాబోయే ఎమ్మెల్యే తానే అంటున్నారు. బుధవారం విశాఖపట్నం లో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 2024 నేనే ఎమెల్యేను అంటూ భవిష్యవాణి వినిపించారు. డబ్బులు, మద్యం పంపిణీ చేయకుండా ఎవరు పోటీ చేసినా తనదే గెలుపన్న ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసినా నాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయమని సీఎం వైఎస్ జగన్ను ఆహ్వానించారు. పొత్తు ఉన్నా, లేకున్నా , జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసినా విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.