పశ్చిమగోదావరి : ప్రజలు, మేధావి వర్గాల సూచనలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పీపుల్స్ మేనిఫెస్టో రూపొందుతోందని కాపు సంక్షేమ సేన, అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంశాల వారీగా చర్చించి జనసేన, తెలుగుదేశం ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చుతామని చెప్పారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ పేద కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం, ఉపాధి అవకాశం కల్పించాలనేది తమ మొదటి లక్ష్యమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కోస్తా కారిడార్ విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీసీలకు కనీసం 30శాతం విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలనేది ప్రతిపాదన ఉందన్నారు. కాపుల జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలనేది తమ ప్రతిపాదన అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన 18 మంది సభ్యులతో మేనిఫెస్టో ఖరారు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రజాభిప్రాయాలను 98486 34249, 70369 24692 అనే ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.