హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాలు, అనుబంధ విభాగాలకు సంబంధించి రాష్ట్రానికి భారీ పెట్టుబడి వచ్చింది. 600 కోట్ల రూపాయల పెట్టుబడితో బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కోసం ఉపయోగించే లిథియం బ్యాటరీలు, సెల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ సంస్థ అట్టెరో ఇండియా ప్రకటించింది.
రాష్ట్రంలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సంస్థ అట్టెరో ఇండియా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కోసం ఉపయోగించే లిథియం బ్యాటరీలు, సెల్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ-వేస్ట్ రీసైక్లింగ్ లో ప్రముఖ సంస్థ అట్టెరో ఇండియా వెల్లడించింది. తన అనుబంధ సంస్థ అగ్గెర్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో రూ.600 కోట్ల పెట్టుబడితో కొత్త ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కొత్త ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, మరికొందరికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెప్పింది. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఈ మేరకు ప్రకటించింది. దీనిపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎర్ర తివాచీ పరుస్తోందని అన్నారు. ఇటీవల రెండు సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు జినోమ్ వ్యాలీలో రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపాయి. ఇందులో రూ. 400 కోట్లతో తయారీ పరిశ్రమను గ్రాన్యూల్స్ ఇండియా నెలకొల్పనుండగా తయారీ రంగంలోనే లారస్ ల్యాబ్స్ రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. తద్వారా రాష్ట్రంలో 1,750 మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు చెప్పారు.