భూమి, ఆకాశం, సముద్రం నుంచి దాడులు
200 మంది ఇజ్రాయెలీల మృతి
1100 మందికి గాయాలు
వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన హమాస్
భూమి, ఆకాశం, సముద్రం నుంచి దాడులు
200 మంది ఇజ్రాయెలీల మృతి
1100 మందికి గాయాలు…గాజాపై ప్రతి దాడికి దిగిన ఇజ్రాయెల్
జెరుసలేం : పశ్చిమాసియా భగ్గుమంది. ఉప్పు నిప్పులా ఉండే ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఉరుములేని పిడుగులా ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులకు దిగింది. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామునే వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించడంతోపాటు సాయుధులైన డజన్లకొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా హమాస్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పట్టణాల్లో మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు. డజన్లకొద్దీ ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి భీకర పోరు సాగుతోంది. రెండు పట్టణాల్లో పలువురిని బందీలుగా చేసుకుని పాగా వేశారు. హమాస్ దాడుల్లో 200 మంది మరణించారు. 1100 మంది గాయపడ్డారు. వారిలో 77 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 9 మంది నేపాలీలు ఉన్నారు. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి దీనిద్వారా మరో తలనొప్పి వచ్చి పడినట్లయింది. 1973లో పొరుగు దేశాలతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి 50 ఏళ్లయిన సందర్భంగా హమాస్ ఈ దాడికి దిగడం గమనార్హం.
అవాక్కయిన ఇజ్రాయెల్
హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడితో అవాక్కయిన ఇజ్రాయెల్.. తిరిగి తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 232 మంది మరణించారు. 1,697 మంది గాయపడ్డారు. మరోవైపు తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ దాడులపై ప్రపంచ నేతలంతా స్పందించారు. ఇజ్రాయెల్‌పై దాడిని బైడెన్, రిషి సునాక్ ఖండించారు. ఆ దేశానికి పూర్తి మద్దతు ప్రకటించారు. పాలస్తీనాకు ఇరాన్ బాసటగా నిలిచింది. దాడులను వెంటనే ఆపాలని ఐరాస అత్యవసరంగా పిలుపునిచ్చింది.