హిందూ ధర్మ ప్రాచుర్యానికై ప్రముఖ దేవాలయాల్లో మాసోత్సవాలు, 6(ఎ) దేవాలయాల్లో వారోత్సవాలు
ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
గుంటూరు : రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి విస్తృత ప్రాచుర్యాన్ని కల్పించేందుకై అన్ని ప్రముఖ దేవాలయాలు మాస పత్రికలను ప్రచురించేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టెంపుల్ టూరిజానికి మంచి ప్రాచుర్యం ఉందని, అదే తరహాలో రాష్ట్రంలో కూడా టెంపుల్ టూరిజానికి మంచి ప్రాచుర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటామన్నారు. దేవాదాయ ధర్మాధాయ శాఖ పరంగా ఇప్పటికే “ఆరాధన” అనే మాస పత్రికను ప్రచురించడం జరుగుచున్నదని, ఈ మాస పత్రికకు 32 వేలకు పైగా చందాదారులు ఉన్నారన్నారు. ఈ మాస పత్రిక ప్రచురణకై రాష్జ్ర విడిపోక ముందు ఐదుగురు సభ్యులతో సంపాదక మండలి ఉండేదని, ఇప్పుడు ఈ సంపాదక మండలిని ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసి, ఈ మాస పత్రికను మరింత అభివృద్ది పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల ప్రాశస్త్యాన్ని, విశేషములను, పలు దేవాలయాల్లో జరిగే విశేష కార్యక్రమాలతో పాటు ప్రముఖ ప్రవచన కర్తలైన చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముకు శర్మ తదితరులతో ధర్మ సందేహాలకు సరైన సమాధానాలను ఈ పత్రికలో ప్రచురించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో ప్రముఖ దేవాలయమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం వారు “కనక దుర్గ ప్రభ” అనే మాస పత్రికను, శ్రీశైల దేవస్థానం వారు “శ్రీశైల ప్రభ” అనే మాస పత్రికను ప్రచురించడం జరుగుచున్నదని, భక్తులకు అవసరమైన ఆధ్యాత్మిక సమాచారాన్ని మరింత విస్తృత స్థాయిలో ఆయా మాస పత్రికల్లో ప్రచురించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. అదే విధంగా పలు ప్రముఖ దేవాలయాలైన అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర దేవాలయాలు కూడా నూతనంగా మాస పత్రికలను ప్రచురించేందుకు ఆదేశాలను జారీ చేయడమైనదని, అందుకు అవసరమైన అన్ని పరిపాలనా అనుమతులను జారీచేయడమైందన్నారు. ఒక ప్రాంతంలోని దేవాలయాల్లోని విశేషాలను, 6 (ఎ) దేవాలయాల వివరాలను, ఆయా దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలను, విశేషాలను మరొక ప్రాంత వాసులకు తెలియజేసే విధంగా ఈ మాస పత్రికలను ప్రచురిస్తామన్నారు. ఇందుకై రాష్ట్ర స్థాయిలో ఒక కేంద్రీకృత సలహా, సంపాదక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సనాతన హిందూ ధర్మానికి ప్రాచుర్యం కల్పించేందుకై ప్రముఖ దేవాలయాల్లో మాసోత్సవాలు, 6(ఎ) దేవాలయాల్లో వారోత్సవాలు
సనాతన హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో మాసోత్సవాలను ఆగస్టు 6 న అన్నవరంలోను, 16వ తేదీన శ్రీకాళహస్తిలోను, సెప్టెంబరు 14 న కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో ప్రారంభించడం జరిగిందని, ఈ మాసోత్సవాలు ఇంకా విజయవంతంగా జరుగుచున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ దసరా పండుగ తదుపరి విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలోను, ద్వారకా తిరుమల, సింహాచలం, శ్రీశైలం, పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయాల్లోనూ ఈ మాసోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని 6(ఎ) దేవాలయాల్లో కూడా వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ అక్టోబరు మాసంలో ప్రారంభించడం జరుగుతుందని, జిల్లాల విభజనకు ముందున్న పాత ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తొలుత ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. అదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో కూడా నిర్వహించనున్నామన్నారు.