కలెక్టర్ కృతికా శుక్లా
కాకినాడ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ బ్రిలియంట్ కన్వెన్షన్
సెంటర్లో బుధవారం జరిగిన ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు కంటెస్ట్
(ఐఎస్ఏసీ)-2022 విజేతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర గృహ
నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చేతులమీదుగా
కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా.
కృతికా శుక్లా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్
నాగనరసింహారావు, మునిసిపల్ వైద్య అధికారి డా. పృథ్వీచరణ్తో కలిసి
అవార్డు అందుకున్నారు. స్మార్ట్ సిటీల పోటీల్లో పారిశుద్ధ్యం కేటగిరీలో ఘన
వ్యర్థాల నిర్వహణ విభాగంలో దేశంలోనే రెండోస్థానంలో కాకినాడ స్మార్ట్ సిటీ
నిలవడంతో ఈ అవార్డు లభించింది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఇండోర్లో
ఇండియా స్మార్ట్ సిటీ కాంక్లేవ్-2023 జరుగుతోంది.
రెండో రోజు బుధవారం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారత
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రజల జీవన నాణ్యతను పెంచే
లక్ష్యంతో స్మార్ట్ సిటీల్లో చేపడుతున్న వినూత్న, సుస్థిర, సమ్మిళిత,
సురక్షిత ఆరోగ్య కార్యక్రమాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు
అందజేస్తోందని, పారిశుద్ధ్యం-ఘన వ్యర్థాల నిర్వహణలో కాకినాడ స్మార్ట్
సిటీకి అవార్డు లభించినందుకు చాలా ఆనందంగా ఉందని కలెక్టర్ కృతికా శుక్లా ఈ
సందర్భంగా పేర్కొన్నారు. అవార్డు రావడంలో కీలకపాత్ర పోషించిన ప్రజలకు,
ప్రజాప్రతినిధులకు, స్మార్ట్ సిటీ అధికారులకు, సిబ్బందికి, పారిశుద్ధ్య
సిబ్బందికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నట్లు
తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్వచ్ఛాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో
కాకినాడను స్వచ్ఛతలో ముందు నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు కలెక్టర్
కృతికా శుక్లా వెల్లడించారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ ఈఈ
మాధవి పాల్గొన్నారు.