ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసి, పార్లమెంటు సభ్యత్వానికి తనను అనర్హుడిగా ప్రకటించినందుకు పాక్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని ఇమ్రాన్ అన్నారు. తన పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసి, జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) సభ్యత్వానికి తనను అనర్హుడిగా ప్రకటించినందుకు పాకిస్థాన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజాపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్(70) ప్రకటించారు. జీటీ రోడ్డుపై లాంగ్ మార్చ్ ప్రారంభించిన నాలుగో రోజు ఉదయం ఆయన ఈ హెచ్చరిక జారీచేశారు. విదేశీ నేతలు, ఉన్నతాధికారులు ఇచ్చే బహుమతులను ప్రభుత్వ భాండాగారం (తోషాఖానా)లో భద్రపరచాలని పాక్ చట్టం నిర్దేశిస్తోంది. ఇమ్రాన్‌ఖాన్ ఈ చట్టాన్ని ఉల్లంఘించారనీ, నిషిద్ధ మార్గాల్లో విరాళాలు స్వీకరించారనీ సికందర్ రజా నాయకత్వంలోని అయిదుగురు సభ్యుల కమిటీ తీర్మానించి ఆయన్ను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది. దీనిపై రజాను కోర్టుకు ఈడుస్తానని ఇమ్రాన్ ప్రకటించారు. 2,400 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన షెహబాజ్ శక్తిమంతులతో రాజీ కుదుర్చుకుని శిక్ష పడకుండా తప్పించుకున్నారని, ప్రధాని షెహబాజ్ షరీఫ్ శక్తిమంతుల బూట్లు పాలిష్ చేస్తూ, బలహీనులను అణచివేస్తున్నారని దుయ్యబట్టారు. నేషనల్ అసెంబ్లీ గడువు 2023 ఆగస్టులో ముగియనున్నా, అంతకన్నా ముందే మధ్యంతర ఎన్నికలను నిర్వహించాలని ఇమ్రాన్ పట్టుబడుతున్నారు. తన డిమాండ్ల సాధనకు రాజధాని ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్ ప్రారంభించారు.