రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర
అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆమె విశాఖలో మీడియాతో
మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని, జగన్ కక్ష సాధింపు చర్యలకు
పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి
నెట్టి వేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపిలో నాణ్యతలేని మద్యాన్ని
ప్రజలతో తాగిస్తున్నారని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజమని, గతంలో రాష్ట్రంలో ఉన్న
మద్యం బ్రాండ్లను పూర్తిగా మార్చేశారని, కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి
తెచ్చి వాటి ద్వారా దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఉన్న యాజమాన్యాల నుంచి
కంపెనీలు లాక్కుని పేర్లు మార్చి అధికార పార్టీలో ఉన్న ముఖ్య నేతలు వీటిని
నడుపుతున్నారన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీనే కంపెనీ ఇవ్వనంటే ఆయన
తయారు చేసిన మద్యాన్ని కొనకుండా పక్కన పెట్టేశారన్నారు. ఏపీలో ఆరోగ్యానికి
పూర్తి హానికరమైన పదార్ధాలతో మద్యం తయారీ జరుగుతోందని, రాష్ట్రంలో ఎక్కడా
అభివృద్ధి లేదని, ఒక్క పరిశ్రమ రాలేదని, ఇలా అయితే మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు
ఎలా వస్తాయని పురంధేశ్వరి ప్రశ్నించారు.