రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
ఏలూరు : పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల
కార్యక్రమం తో రాష్ట్రంలో పేదరికం శాతం 12 నుండి 6 శాతం దిగువకు వచ్చిందని
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. స్థానిక
జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం నవరత్నాల కార్యక్రమాల
అనుసంధానంగా సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై నవరత్నాలు ప్రోగ్రామ్
ఎక్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఏ ఎన్ నారాయణమూర్తి, జిల్లా వె. ప్రసన్న వెంకటేష్
లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు
మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చేస్తున్న కృషి కారణంగానే
సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో నీతి ఆయోగ్ సూచించిన ప్రమాణాలను
చేరుకుంటున్నామన్నారు. సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముఖ్యంగా విద్య,
వైద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగిందని, మాతా, శిశు మరణాలు
తగ్గించడం, గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం
నివారణకు చర్యలు తీసుకోవడం, డ్రాప్ అవుట్ లను నివారించి బడి ఈడు పిల్లలు
పాఠశాల్లలోనే ఉండేలా చర్యలు తీసుకోవడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తి
స్థాయిలో కల్పించడం, వంటి 8 అంశాలలో నిర్దేశించిన లక్ష్యాలను క్షేత్రస్థాయిలో
సాధించేలా ప్లానింగ్ బోర్డు సమీక్షిస్తుందన్నారు. ఏ ఏ కార్యక్రమాలలో
వెనుకబడి ఉన్నారో పరిశీలించి, వాటిని అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలు,
సూచనలు అందించడం జరుగుతుందన్నారు.
దేశంలో ఎక్కడా జరగనివిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న విన్నూత్నమైన పధకాలు
దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. సుస్ధిర అభివృద్ధి
లక్ష్యాల సాధనలో నీతి ఆయోగ్ సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా జిల్లాలో లక్ష్యాల
సాధనకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో గర్భిణీలు, బాలింతలు,
మహిళలు, చిన్నపిల్లలు, పాఠశాలల బాల,బాలికలల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం
లేకుండా సంపూర్ణ పోషణ కిట్స్ అందరికీ అందించి, వాటిని వారు వినియోగించుకునేలా
అంగన్వాడీ, ఏ ఎన్ ఎం, ఉపాధ్యాయులు పరిశీలించాలన్నారు. 10వ తరగతి ఫెయిల్ ఐన
వారిలో 494 మంది విద్యార్థినీ విద్యార్థులు సంబంధిత పాఠశాలల పరిధిలో
లేనట్లుగా చూపిస్తున్నారని, వారు ఎక్కడ ఉన్నారో పరిశీలించి వారిని తిరిగి
పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రాప్ అవుట్ లలో 7467
మందిలో 5985 మందిని తిరిగి పాఠశాల్లో చేర్పించారని, మిగిలిన వారిని కూడా
పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార
లోపం నివారణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
నవరత్నాలు ప్రోగ్రామ్ ఎక్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఏ ఎన్ నారాయణమూర్తి
మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా
నిలుస్తున్నదన్నారు. ప్రతీ జిల్లాలోనూ నవరత్నాల కార్యక్రమాలు అమలు తీరును
పరిశీలించి, అవసరమైన సూచనలు, సలహాలు అందించి లక్ష్యాల సాధనను
పర్యవేక్షిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్
రాష్ట్రంగా తీర్చిదిద్ధేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, దేశంలో ఎక్కడా
జరగని విధంగా 30 లక్షలకు పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, పక్కా
గృహాలు అందిస్తుంటే, కొంతమంది ఈ కార్యక్రమాలపై బురద చల్లుతున్నారన్నారు.
సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో వెనుకబడిన అంశాలపై ప్రత్యేక దృష్టి
కేంద్రీకరించాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో
గర్భిణీలు, బాలింతలు, మహిళలు, చిన్నపిల్లలు, పాఠశాలల బాల,బాలికలల్లో రక్తహీనత,
పౌష్టికాహార లోపం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సచివాలయం
స్థాయిలోని అంగన్వాడీ, ఏ. ఎన్ ఎం. , పాఠశాల తీవ్రమైన రక్తహీనత, పౌష్టికాహార
లోపం ఉన్నవారిని గుర్తించి, వారికి వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని,
సంబంధిత శాఖల సిబ్బందితో ప్రత్యేక రిజిస్టర్ లో తీవ్రమైన రక్తహీనత,
పౌష్టికాహార లోపం ఉన్నవారి పేర్లను నమోదు చేసి, వారి ఆరోగ్య పరిరక్షణను
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. సంబంధింత గ్రామాలలో ఆరోగ్య
పరిరక్షణపై ఎంపిడిఓ, సీడీపీఓ, వైద్యాధికారులతో అవగాహనా కార్యక్రమాలు
నిర్వహిస్తున్నామన్నారు. అనుబంధ పోషకార పంపిణీ కార్యక్రమం కింద అంగన్వాడీ
సిబ్బంది ద్వారా సంపూర్ణ పోషణ కిట్లు అందించి, వారు సక్రమంగా వినియోగించేలా
చూస్తున్నామన్నారు. రెండవ విడత నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో
పూర్తిస్థాయిలో శుద్ధమైన త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, వంటి మౌలిక సదుపాయాలు
కల్పించామన్నారు. కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ యం.సూర్య తేజ, నూజివీడు సబ్
కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్,ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ పూజా, ఇంచార్జి
డి ఆర్ వో సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, జిల్లా పరిషత్
సీఈఓ కె. రవికుమార్, డి ఆర్ డి ఏ పీడీ విజయరాజు, జిల్లా వ్యవసాయశాఖాధికారి వై.
రామకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ఠ, వివిధ శాఖల జిల్లా
అధికారులు పాల్గొన్నారు.