స్కాంలో ఉన్నది ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైరికల్ పంచ్ వేశారు మంత్రి బొత్స
సత్యనారాయణ. దొరికితే దింగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా చంద్రబాబు ఇన్నాళ్లు
ప్రవర్తించారు. ఇన్నాళ్లు తప్పులు చేసినా దొరకలేదు.. ఇప్పటికి దొంగ దొరికిపోయి
జైలుకు వెళ్లారని చురకలంటించారు. అలాగే, స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే
వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ
శనివారం మీడియాతో మాట్లాడుతూ స్కిల్ స్కాం కేసులో ప్రేమ చంద్రారెడ్డి మీద
మాకు ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు. స్కాంలో ఎవరి పాత్ర ఉంటే వారిపై తప్పకుండా
చర్యలు తీసుకుంటాం. అధికారులు అభ్యంతరం చెప్పిన తర్వాతే ఫైల్ సీఎం దగ్గరకు
వెళ్తుంది. దానికి ముఖ్యమంత్రిదే బాధ్యత ఉంటుంది. రిమాండ్ కొనసాగింపు
సందర్బంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారు. అందుకే ప్రజాజీవితంలో
ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అవినీతి చేయకుండా పరిపాలన సాగించాలన్నారు.
సాఫ్ట్‌వేర్‌కు అన్ని వేల కోట్టా..? : ఇన్నాళ్లూ తప్పులు చేసినా దొరకలేదు.
దొరికితే దొంగ..దొరకకపోతే దొర అన్నట్టు చంద్రబాబు ఇన్నాళ్లూ వ్యవహరించారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చాక సీమెన్స్ కంపెనీ తన వాటా ఎందుకివ్వలేదు. మధ్యలో
డిజైన్ టెక్ ఎలా వచ్చింది?. చంద్రబాబు తెలిసే తప్పు చేశారు. సీమెన్స్ కంపెనీ
మంచి కంపెనీనే. కానీ, ఒప్పందం ప్రకారం జరగలేదు. సాఫ్ట్ వేర్ రూ.2900 కోట్లా?.
సీమెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన సాఫ్ట్ వేర్ ఎక్విప్మెంట్ ఎందుకు రాలేదు?.
రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని అన్యాక్రాంతం చేశారు. చంద్రబాబు చేసిన అవినీతిపై
ఆధారాలు ఉన్నాయి. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. మా ప్రభుత్వం
అవినీతిని సహించదు. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే కుదరదు. అవినీతి చేసిన
వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.