సమాజం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి గుండెలు ఎదురొడ్డి నిలిచిందని సీఎం
కేసీఆర్ అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం
ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ
సందర్భంగా సీఎం జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో
సెప్టెంబర్ 17కి ఓ ప్రత్యేకత ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. భారత్‌లో
హైదరాబాద్ అంతర్భాగమైన రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని
నిర్ణయించామని చెప్పారు. ఆనాటి ప్రజా పోరాట ఘట్టాలు.. సామాన్యులు అసమాన్యులై
చేసిన త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయన్నారు. దొడ్డి
కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురం భీం, రావి నారాయణరెడ్డిలాంటి వీరయోధులకు
నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. నాటి జాతీయోధ్యమ నాయకుల స్ఫూర్తిదాయక కృషిని
ఈ సందర్భంగా స్మరించుకుందామన్నారు.
అభివృద్ధి అంటే ఏంటో అనతికాలంలోనే చాటి చెప్పాం : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ
ప్రాంతం, ప్రజానీకానికీ తీవ్ర అన్యాయం జరిగింది. ఆ తర్వాత మహోద్యమానికి
సారథ్యం వహించడం చరిత్ర నాకందించిన మహదవకాశం. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు
నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం నా భుజస్కంధాలపైనే మోపారు. రాష్ట్రం సాకారమైన
నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి
ఆదర్శంగా నిలిచాయి. 76 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా పేదరికం, నిరుద్యోగం,
సాంఘిక వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తుండటం దురదృష్టకరం. రాష్ట్రంలో మానవీయ
కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాం. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని
కుటుంబమేదీ రాష్ట్రంలో లేదు. ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. అభివృద్ధి
అంటే ఏంటో అనతికాలంలోనే దేశానికి చాటిచెప్పగలిగాం. ‘తెలంగాణ ఆచరిస్తోంది- దేశం
అనుసరిస్తోంది’ అన్న మాట అక్షర సత్యం.
పాలమూరు-రంగారెడ్డి’తో ఆరు జిల్లాలు సస్యశ్యామలం : ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు
జిల్లాది ఒక విషాదగాథ. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు
సస్యశ్యామలం అవుతాయి. ఈ పథకానిది ఓ పోరాట చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు. హైదరాబాద్ రాష్ట్రం కొనసాగి
ఉంటే అప్పర్ కృష్ణా, తుంగభద్ర, భీమా ఎడమ కాలువ ద్వారా 7 లక్షల ఎకరాలకు
సాగునీరు అంది ఉండేది. 60 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా పొట్టచేతబట్టుకొని కూలి
పనులు చేసుకునే దుస్థితికి మనందరం కన్నీటి సాక్షులమే అని కేసీఆర్ అన్నారు.