ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి ధ్రువస్త్ర, 12
సుఖోయ్ 30-MKI యుద్ధ విమానాలు సహా వివిధ ఆయుధ వ్యవస్థలను రూ.45వేల కోట్లతో
కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. రక్షణమంత్రి రాజ్నాథ్
సింగ్ సారథ్యంలోని రక్షణ కొనుగోలు మండలి ఆమోదం తెలిపింది.
దేశ భద్రతా దళాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం
తీసుకుంది. రూ.45 వేల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు ప్రాథమిక ఆమోదం తెలిపింది.
అందులో 12 సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానాలు, ధ్రువాస్త్ర క్షిపణుల సమీకరణ,
డోర్నియర్ విమానాల ఆధునికీకరణ వంటివి ఉన్నాయి. భారత రక్షణశాఖ మంత్రి
రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి (డీఏసీ) మొత్తం
తొమ్మిది ప్రతిపాదనలకు శుక్రవారం ఆమోదం తెలిపింది. ‘ఆత్మనిర్భర్ భారత్’
దిశగా స్వదేశీ సంస్థల నుంచే ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు రక్షణ శాఖ అధికారులు
తెలిపారు. రక్షణ ఉత్పత్తుల్లో స్వదేశీ సామగ్రి వినియోగాన్ని 50 శాతం నుంచి
60-65 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని రాజ్నాథ్ సింగ్
పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. డోర్నియర్ విమానాల్లోని ఏవియానిక్స్ను
ఆధునికీకరించాలన్న వైమానిక దళ ప్రతిపాదనలకు కూడా రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
దీనివల్ల ఈ లోహవిహంగాల కచ్చితత్వం పెరుగుతుందని చెప్పింది. అయితే గత
కొద్దిరోజులుగా పలు సందర్భాల్లో ఈ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న
నేపథ్యంలో ఈ ఆధునికీకరణ అవసరమైంది.
100 యుద్ధవిమానాలకు ఆర్డర్!
కొద్ది రోజుల క్రితం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి 100
తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆర్డర్ ఇవ్వనుందని
సీనియర్ రక్షణ అధికారులు తెలిపారు. స్వదేశీ ఏరోస్పేస్ పరిశ్రమకు ఊతమిచ్చేలా
మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో మరో 100 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలను
కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ 100 తేలికపాటి యుద్ధ
విమానాలకు సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించామని..
త్వరలోనే వాటికి ఆమోదం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనల
విలువ రూ.66వేల కోట్లకుపైగా ఉంటుందని తెలుస్తోంది.