విజయవాడ : కేంద్రంలోని బిజెపి. ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం
రాహుకేతువులుగా దాపురించాయని, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా
చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్
లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం
దేశాన్ని అప్పుల భారత్ చేసిందని, ఈ దేశాన్ని మోడీ ప్రభుత్వం అమ్మకానికి
పెట్టిందన్నారు. వంట గ్యాస్, డిజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు సామాన్యులకు
అందుబాటులో లేవని, మోడీ పాలనలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం
పెరిగిందని, మణిపూర్ లో మానవ ఇతిహాసంలోనే కని విని ఎరుగని విధంగా మారణ హోమం
జరిగిందన్నారు. డబల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ గా మారిందన్నారు.
జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు
పూర్తిగా క్షీణించాయి. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఎర్రచందనం, ఎర్రమట్టి,
సబ్సిడీ బియ్యం మాఫియాలు స్వైర విహారం చేస్తున్నాయి. అవినీతి ఆంధ్ర ప్రదేశ్ గా
మారింది. రాష్ట్ర మద్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్ర ప్రదేశ్,
బూతుల ఆంధ్ర ప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ ల తయారయింది. కరెంటు చార్జీలు,
ఆర్టీసీచార్జీలు, మద్యం, ఇసుక, పెట్రోలు, డీజల్, నిత్యవసర సరుకుల ధరలు
సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయాయని ఆయన దుయ్యబట్టారు. ఈ విలేకరుల
సమావేశంలో నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, వి. గురునాథం, డా. జంధ్యాల
శాస్త్రి, కొమ్మినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు.