పేదవారికి మంచి జరగాలన్నదే మా ఆలోచన
ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలి
విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన సీఎం జగన్
వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను
ప్రారంభించిన సీఎం
విజయనగరం : విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం వైయస్.జగన్ మోహన్
రెడ్డి ప్రారంభించారు. వైద్య కళాశాల ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ
డాక్టర్ వైయస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ప్రభుత్వ వైద్యకళాశాలలో ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, అనంతరం వివిధ విభాగాలకు
చెందిన ల్యాబులను సీఎం పరిశీలించారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని
ప్రారంభించి అనంతరం వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం,
నంద్యాలలో కాలేజీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేదవారికి మంచి
జరగాలన్నదే మా ఆలోచన. ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలి అని అన్నారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రతీ పార్లమెంట్
నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా ప్రభుత్వం ముందుకు
వెళ్తోందని, వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత
ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు
వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ స్థాయిలో సదుపాయాలతో
కాలేజీ నిర్మాణం అద్భుతం. మెడిసిన్ చదవాలనుకున్న మా కల సాకారమవుతోంది. సీఎం
జగన్‌కు మా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఉపముఖ్యమంత్రి (గిరిజన
సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,
ఎం.టీ కృష్ణబాబుతో పాటు పలువులు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.