విశాఖపట్నం : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి గంటా
శ్రీనివాసరావు నివాసంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ
చంద్రబాబు అక్రమ అరెస్టు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం కూడా
జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం పాత్రపై కూడా అనుమానం ఉందని
తెలిపారు. చంద్రబాబుకి అనుకోని సంఘటనలు ఏమి జరిగినా భారీ మూల్యం చెల్లించక
తప్పదని హెచ్చరించారు. జగన్ తన రాజకీయ మరణశాసనాన్ని తానే రాసుకున్నారన్నారు.
బాబుని అరెస్టు చేసి జగన్ కొరివితో తల గోక్కున్నారన్నారు. శవపేటికకు చివరి
మేకు ఆయనకు ఆయనే కొట్టేసు కున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.
అవినీతిపరుడు అందలం ఎక్కి రాజ్యాధికారం చేస్తే నీతి మంతులు జైలులో
ఉంటారన్నారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అయిన వ్యక్తి జైలులో ఉంచడం అంటే
సూర్య కాంతిని అరచేతితో అపాలని చూడడమే అని అన్నారు. అంతిమ విజయం బాబుదే.
కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుని ఒక్క రోజు
అయిన జైలులో ఉంచాలి అనే రాజకీయ దురుద్దేశం జగన్‌కు ఉందన్నారు. అధికారులు పీవీ
రమేష్, డిజైన్ టెక్ ఎండీ వంటి వారు ఓపెన్ చాలెంజ్ విసిరారని, చంద్రబాబు
నాయుడికి సంబంధం లేదని మాజీ మంత్రి స్పష్టం చేశారు.
పవన్‌పై గంటా ప్రశంసలు : రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును జనసేన
అధినేత పవన్ కళ్యణ్ కలవడంపై గంటా స్పందిస్తూ పవన్‌పై ప్రశంసలు కురిపించారు.
పవన్ కళ్యాణ్‌కు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. కష్ట కాలంలో పవన్ కళ్యాణ్
స్పందించడం చాలా సంతోషమన్నారు.