గ్రంథాలయ ఉద్యమ పితామహులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు 140 వ జయంతి ఉత్సవాల్లో
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
మండలి బుద్ధప్రసాద్ కు గాడిచర్ల ఫౌండేషన్ అవార్డ్ బహుకరణ
కృష్ణా విశ్వవిద్యాలయంలో ఘనంగా గాడిచర్ల 140 వ జయంతి ఉత్సవాలు
మచిలీపట్నం : వందేమాతరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొనీ అరెస్ట్ కావడం ద్వారా
గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రా బాలగంగాధర తిలక్ గా పేరు గడించారని రాష్ట్ర
గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శ్లాఘించారు. గ్రంథాలయ ఉద్యమ పితామహులు గాడిచర్ల
హరిసర్వోత్తమరావు 140 వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాడిచర్ల ఫౌండేషన్
ఆధ్వర్యంలో గురువారం స్థానిక కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన
కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు గా, పాత్రికేయుడుగా, రచయితగా,
రాజకీయవేత్తగా బహుముఖ పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాడిచర్ల
హరిసర్వోత్తమరావు అని కొనియాడారు. 1908 స్వరాజ్య వారపత్రిక నిర్వహించడమే
కాకుండా , ఆంధ్ర పత్రిక తొలి ఎడిటర్ గా సేవలు అందించారన్నారు. స్వరాజ్య పార్టీ
నుండి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు కర్నూల్ జిల్లా నుండి ఎన్నికయ్యారు
అని పేర్కొన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ మాతృ భాషలో
విద్యా విధానం వుండాలి అని ఆనాడే గాడిచర్ల హరిసర్వోత్తమరావు నొక్కి
చెప్పారన్నారు. 1908 లో బందరులో ఆయన శిక్షకు గురైన అంశాన్ని దృష్టిలో
పెట్టుకొని ఇక్కడ ఆయన 140 వ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం ముదావహం అన్నారు.
మచిలీపట్నం లో ఆనాడు విద్యాభ్యాసం చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, బెజవాడ
గోపాలరెడ్డి లు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి లు గా పని చేసిన విషయాన్ని
దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది అని
వివరించారు. జాతికి దారి చూపే దీప స్తభం లా కృష్ణా విశ్వవిద్యాలయ విద్యార్థులు
తయారు కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య
హేమ చంద్రారెడ్డి మాట్లాడుతూ 1937 లో రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి దోహదపడే
శ్రీబాగ్ ఒప్పందం లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు కృషి చేశారన్నారు. ఆనాడు ఆంధ్ర
ప్రదేశ్ లో అరెస్ట్ అయిన తొలి పాత్రికేయుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని
పేర్కొన్నారు.
గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు కె చంద్రశేఖర కలకురా అధ్యక్షోపన్యాసం చేస్తూ
బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాల ద్వారా ఉత్తేజం పొందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు
జాతీయ ఉద్యమం లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎం ఏ డిగ్రీ పొందిన
రెండో వ్యక్తి గాడిచర్ల అన్నారు. వ్యవసాయ రంగంలో నిరక్షరాస్యులకు ఆనాడే శిక్షణ
కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. సంస్థ కార్యదర్శి రావి శారద వార్షిక
నివేదికను సమర్పించారు. తొలుత కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి
జ్ఞానమని సభాపరిచేయం చేయగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జ్యోతి ప్రజ్వలన
చేశారు. అనంతరం తెలుగు భాష అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలకుగాను మాజీ
ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గాడిచర్ల
హరిసర్వోత్తమరావు అవార్డును బహూకరించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్
నజీర్, అతిథులను ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమని, రిజిస్ట్రార్ డా బ్రహ్మచారి
శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు, జిల్లా
ఎస్పీ ప్రశాంతి, కృష్ణా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా బ్రహ్మచారి, రెక్టర్
ఆచార్య సూర్య చంద్ర రావు, జిల్లా అధికారులు, గాడిచర్ల ఫౌండేషన్ సభ్యులు,
విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.