అమరావతి : చంద్రబాబు రిమాండ్ పిటిషన్ కొట్టివేతపై ప్రభుత్వం వారం రోజులు సమయం
కోరడం సాగదీత ధోరణే అని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్
మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానంలో విచారణ
ఎదుర్కోలేక ఎందుకు డొంక తిరుగుడుగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రజాక్షేత్రంలో నూకలు చెల్లినందున ఎన్నికల్ని ఎదుర్కోలేక చేసే పిరికిపంద
చర్యలివి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడి, ఏదో రకంగా
ఎన్నికల అక్రమాలకు పాల్పడి మళ్లీ గెలవాలనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
న్యాయ ప్రక్రియను కూడా అడ్డుకోవ్వాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారన్నారు.
చంద్రబాబు నిజాయితీ నిరూపణకు మరో రెండు రోజులు ఆలస్యం కావొచ్చు కానీ, చేసిన
తప్పులు నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేరని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థ
పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం
చేస్తోందన్నారు. కక్షసాధింపు, జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ప్రభుత్వ వ్యవస్థల్ని
దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో ఈ తరహా వ్యక్తిగత
కక్షసాధింపు చర్యలు ఇప్పటి వరకూ లేవన్నారు. ముందుగా ఎన్నికలకు వెళ్లమని ఈనాడు
చెప్పే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. కేసులో ఏమీ లేని
చంద్రబాబుకే వైసీపీ నేతలు అంటున్నట్లు జీవితకాలo శిక్ష పడితే జగన్,
విజయసాయిలపై ఉన్న కేసులకు ఎన్ని జీవితాలు కావాలని కనకమేడల రవీంద్ర కుమార్
విమర్శలు గుప్పించారు.