‘టీడీపీ బంద్ అన్నారు…హెరిటేజ్ కూడా మూసివేయలేదు
టీడీపీ బంద్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
గుంటూరు : చంద్రబాబు జైలుకు పోగానే పార్టీ పగ్గాల కోసం అప్పుడే నేతలు బయటకు
వస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
అన్నారు. యనమల రామకృష్ణుడు, నందమూరి బాలకృష్ణ పార్టీ కబ్జా కోసం
ప్రయత్నిస్తున్నారని, ఎందుకంటే నారా లోకేశ్‌కు పార్టీ నడిపే సత్తా లేదని,
ఆయనకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అందుకే ఎవరికి వారు పార్టీ పగ్గాల కోసం
ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే
ఎన్నికల్లో టీడీపీకి మళ్ళీ ఓటమి తప్పదన్నారు. చంద్రబాబు అవినీతిపరుడు కాదని
ఆయన కొడుకు లోకేశ్ చెప్పగలడా? అని అన్నారు. చంద్రబాబు అవినీతి చేయలేదని ఆ
పార్టీ నేతలు కూడా చెప్పలేరని, ఎన్టీఆర్ కుటుంబం కూడా చంద్రబాబు
అవినీతిపరుడు కాదని చెప్పదన్నారు. చంద్రబాబు అవినీతి వ్యవహారం ప్రజలకు కూడా
బాగా అర్ధమైందని, డొల్ల కంపెనీలు పెట్టి యథేచ్ఛగా ఖజానా దోచుకున్నాడని
అందరికీ తెలిసిందన్నారు. కనీసం చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూయలేదని
ఎద్దేవా చేశారు. మంత్రి కారుమూరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ బంద్
గురించి కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలు ఎవరి పనులు వారు చేసుకున్నారు.
అచ్చెన్నాయుడు ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.
స్టేలు తెచ్చుకోవడమే బాబు, లోకేశ్‌కు తెలుసు : ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి వచ్చాకే అనేక సంక్షేమ పథకాలతో పేదలకు మేలు చేస్తున్నారు.
సీఎం జగన్ హయాంలో ఏపీలో పేదరికం బాగా తగ్గింది. చంద్రబాబు అవినీతిపరుడని
ప్రధాని నరేంద్ర మోడీ సైతం చెప్పారు. దాచుకో, దోచుకో అన్నట్టుగా చంద్రబాబు
పాలన సాగింది. చంద్రబాబు, నారా లోకేశ్‌ల అవినీతి మీద కేసులు వేస్తే వారు
స్టేలు తెచ్చుకున్నారని, విచారణకు సహకరించి వారు ప్రజల వద్దకు రావాలని
సూచించారు. చంద్రబాబుకు ఎన్టీ రామారావు శాపం కూడా తగిలింది. అందుకే ఆయన జైలుకు
వెళ్ళాడన్నారు. తనకు అధికారం అంటే ఏమిటో తెలియదని, లోకేశ్ అంటున్నాడు. ఆయన
కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాలేదు. దొడ్డిదారిన మంత్రి అయ్యాడు. స్కిల్
స్కామ్‌లో లోకేశ్ కూడా దోషి. ఆయనకూ శిక్ష తప్పదన్నారు.
బాబు కోసమే పవన్ : ఇక దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్. ఆయన గతంలో చంద్రబాబుపైనా,
తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15
సీట్లు గెలిపించి ఇస్తే ఎక్కడికక్కడ దోపిడి చేశారని, తన తల్లిని, కుటుంబాన్ని
తిట్టారని గగ్గోలు పెట్టిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు అన్నీ మర్చిపోయి కేవలం
చంద్రబాబు కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు.