విజయవాడ : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముుఖ్యమంత్రి నారా
చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో తెలుగుదేశం, ఇతర పక్షాలు ఎటువంటి నిర్ణయం
తీసుకుంటే, ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఎమ్మార్పీఎస్ అదే నిర్ణయం
తీసుకుంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని
తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 74 ఏళ్ల వయస్సు కలిగిన
మాజీ ముఖ్యమంత్రితో పోలీసులు, పాలకులు అమర్యాదగా నడుచుకున్నారు. అరెస్ట్
విషయంలో చంద్రబాబు వయస్సు, హోదాను ఏమాత్రం గౌరవించినట్లు కనిపించలేదు. ఇలాంటి
సందర్భంలో గవర్నర్‌కు చెప్పి నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబును ఏ కేసులో
అరెస్ట్ చేశారో కూడా మొదటగా పోలీసులు చెప్పలేదు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో
అంతిమ నిర్ణయం న్యాయం స్థానానిదేనన్నారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానం
చూస్తుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే చేసినట్లు కనిపిస్తోంది. వివేకారెడ్డి
హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ కాకుండా అదే
పోలీసుల మద్దతు కోరారు. జగన్మోహన్రెడ్డి తన వాళ్లకు ఒక లాగా, ఇతరులకు మరోలాగ
వ్యవహరిస్తున్నారు. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని
అరెస్ట్ చేయడం లేదన్నారు.