న్యూఢిల్లీ : జీ20 సదస్సు జరుగుతున్న భారత్ మండపంలో దేశాధినేతలకు రాష్ట్రపతి
ద్రౌపదీ ముర్ము ఘనంగా విందు ఇచ్చారు. నలంద విశ్వవిద్యాలయ చిత్రాలతోపాటు
వసుధైక కుటుంబం అనే థీమ్‌ల ముందు నిల్చుని విందుకు వచ్చిన అతిథులకు
రాష్ట్రపతితోపాటు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు
బైడెన్‌ను రాష్ట్రపతి, ప్రధాని స్వాగతించారు. తొలుత ఐరాస ప్రధాన కార్యదర్శి
గుటెరస్ రాగా ఆ తర్వాత ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా
భారతీయ సల్వార్ సూట్లో వచ్చారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా తన
సతీమణి రీతు బంగాతో కలిసి వచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వేదిక
వద్దకు చేరుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన సతీమణి అక్షతా
మూర్తితో కలిసి వచ్చారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద సతీమణి యోకో కిషిదతో
కలిసి వచ్చారు. ఆమె చీర ధరించారు. ఇంకా విందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు
మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ సహా మొత్తం 300 మంది అతిథులు
విందులో పాల్గొన్నారు.
నోరూరించే వంటలు : విందులో అతిథులకు వెండి పాత్రల్లో వడ్డించారు. భారతీయ
సంప్రదాయం ఉట్టిపడేలా వంటలకు పేర్లు పెట్టారు. ఆరోగ్యాన్నిచ్చే వంటకాలను
భారత్ అంతటా తింటారని పేర్కొన్నారు. చిరుధాన్యాలతోపాటు (శ్రీఅన్న) కశ్మీరీ
వంటకాల రుచులను అతిథులకు చూపించారు. పాత్రం పేరుతో అందించిన స్టార్టర్‌లో
ఫాక్స్ టెయిల్ చిరుధాన్యాల ఆకులను వేయించి వాటిపై యోగర్ట్ చల్లారు. దానికి
ఘాటు పచ్చడిని జత చేశారు. మెయిన్ కోర్సు అయిన వనవర్ణంలో పనసపండు గాలెట్టీ,
అటవీ పుట్ట గొడుగులు, చిరు ధాన్యాల చక్కిలాలు, కరివేపాకు దట్టించిన కేరళ రెడ్
రైస్ వడ్డించారు. ఇంకా ముంబయి పావ్, బఖర్ఖానీ (యాలకులతో కూడిన తియ్యని
బ్రెడ్) విందులో ఉన్నాయి. మధురిమ పేరుతో ఇచ్చిన మెనూలో చిరుధాన్యాల
పుడింగ్‌ను అందించారు. కశ్మీరీ కహ్వా, ఫిల్టర్ కాఫీ, డార్జిలింగ్ టీ, పాన్
రుచి ఉండే చాక్లెట్ ఆకులను అందించారు.