జీ20 నేతల అంగీకారం
కీలకాంశాలపై ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సదస్సులో పలు కీలకాంశాలపై నేతలు
ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపారు.
క్రిప్టో ఆస్తులను వెల్లడి చేసే కార్యాచరణకు సత్వరం ఆమోదం తెలపాలని నిర్ణయం.
ఇలాంటి ఆర్థికేతర ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ
2027 కల్లా ప్రారంభం కావాలి. ఈ ఆస్తులను పన్ను ఎగవేతదారులు దుర్వినియోగం
చేయకుండా క్రిప్టో అసెట్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ (సీఏఆర్ఎఫ్)ను
రూపొందిస్తున్నాం. కృత్రిమ మేధ (ఏఐ)పై అంతర్జాతీయ నియంత్రణలకు సంబంధించిన
అంశంలో సహకారాన్ని పెంపొందించాలి. సేవల బట్వాడా, నూతన ఆవిష్కరణలపై భద్రమైన,
విశ్వసనీయమైన, జవాబుదారీతనంతో కూడిన డిజిటల్ మౌలిక వసతుల (డీపీఐ)ను
సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో మానవ హక్కులు, వ్యక్తిగత డేటాను, గోప్యత,
మేధోహక్కులను గౌరవించాలి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతను మెరుగుపరచాలి. ఏఐని
అందరి శ్రేయస్సుకు ఉపయోగించాలి.
ఆర్థిక వృద్ధి : వాణిజ్యం, పెట్టుబడులతో ఆర్థిక వృద్ధికి దోహదపడేలా విధానాలను
రూపొందించడానికి అంగీకారం. నిబంధనల ప్రాతిపదికన సాగే, వివక్షకు తావులేని,
పారదర్శక, సమ్మిళిత, సమానత్వంతో కూడిన, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ అవసరం.
అందులో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కీలకంగా ఉండాలి. ఈ సంస్థ పనితీరు
మెరుగుపడేలా సంస్కరణలు అవసరం. 2024 నాటికి సభ్య దేశాలన్నింటికీ అందుబాటులోకి
వచ్చేలా వివాద పరిష్కార వ్యవస్థకు కట్టుబడి ఉన్నాం. కొవిడ్-19 మహమ్మారి
కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యల నుంచి ప్రపంచం కోలుకుంటున్న తీరులో అసమానతలు
ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి దీర్ఘకాల సరాసరి కన్నా తక్కువగా ఉంది. బలమైన,
సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధనే దీనికి సమాధానం. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను
సంస్కరించాలి. అసమానతలను తొలగించడానికి, ఆర్థిక సుస్థిరతను కొనసాగించడానికి
ద్రవ్య, ఆర్థిక, సంస్థాగత విధానాల ఆవశ్యకత ఉంది. విధానాల్లో విశ్వసనీయతను
కాపాడటానికి కేంద్ర బ్యాంకులకు స్వతంత్రత అవసరం. పేదలు, దుర్బల వర్గాలను
రక్షించడానికి తాత్కాలిక, లక్షిత ద్రవ్య విధానాలు చేపట్టాలి. జాంబియా, ఘనా,
శ్రీలంక సహా వర్ధమాన దేశాల్లో రుణ ఇబ్బందులను తక్షణం పరిష్కరించడానికి నిర్ణయం.
బహుళపక్ష బ్యాంకులు : మరింత మెరుగైన, విస్తృత, సమర్థ బహుళపక్ష బ్యాంకుల
ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి ప్రభావాన్ని గరిష్ఠ స్థాయికి
తీసుకెళ్లేందుకు కొత్త భాగస్వామ్యాలను స్వాగతిస్తున్నాం. బహుళపక్ష అభివృద్ధి
బ్యాంకులపై జీ20 స్వతంత్ర సమీక్ష కమిటీ చేసిన సూచనల అమలుకు ఉద్దేశించిన
మార్గసూచీని సమర్థిస్తున్నాం.
*సీమాంతర చెల్లింపులు : 2027 నాటికి వేగవంతమైన, చౌకైన, మరింత పారదర్శకమైన
సీమాంతర చెల్లింపుల వ్యవస్థను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఈ దిశగా జీ20
మార్గసూచీలోని రెండో దశ కార్యాచరణ అమలు చేస్తాం. ఈ దిశగా స్టాండర్డ్
సెట్టింగ్ బాడీలు (ఎస్ఎస్బీ) చేపట్టిన చర్యలను స్వాగతిస్తున్నాం. *
మానవ వనరులు : మానవ వనరుల అభివృద్ధికి తోడ్పాటు కోసం పెట్టుబడులు పెట్టాల్సిన
అవసరం ఉంది. సమ్మిళిత, సమానత్వంతో కూడిన, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణను
అందరికీ అందించేందుకు కట్టుబడి ఉన్నాం. డిజిటల్ అంతరాన్ని అధిగమించడం కోసం
డిజిటల్ పరిజ్ఞానాలను వినియోగించుకోవడానికి కట్టుబడి ఉన్నాం. సాంకేతిక
పురోగతికి అనుగుణంగా విద్యా సంస్థలు, అధ్యాపకులను తీర్చిదిద్దేందుకు అవసరమైన
తోడ్పాటు ఇస్తాం. స్వేచ్ఛాయుత, సమానత్వంతో కూడిన, భద్రమైన శాస్త్రీయ
భాగస్వామ్యాలకు మద్దతిస్తాం. పరిశోధన, విద్యా సంస్థల మధ్య విద్యార్థులు,
నిపుణులు, పరిశోధకులు, శాస్త్రవేత్తల బదిలీలను ప్రోత్సహించేందుకు కట్టుబడి
ఉన్నాం.
వ్యవసాయం : సరకుల ధరల పెరుగుదల వల్ల జీవన వ్యయాలు పెరుగుతున్నాయి. ప్రపంచ
వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయం, ఆహారం, ఎరువుల
వాణిజ్యంలో న్యాయబద్ధ, అంచనాలకు అనుగుణమైన విధానాలకు కట్టుబడి ఉన్నాం. ఎగుమతి
నియంత్రణలను విధించబోం. ఆహార భద్రత, సవాళ్లను ఎదుర్కోవడంలో వర్ధమాన దేశాలకు
తోడ్పాటు అందిస్తాం. ప్రపంచ ఆహార భద్రత, అందరికీ పోషకాహారం సూత్రాలకు కట్టుబడి
ఉన్నాం.
మతం : వ్యక్తులు, మత చిహ్నాలు, పవిత్ర గ్రంథాల లక్ష్యంగా మత విద్వేష చర్యలను
గట్టిగా ఖండిస్తాం. మత, సాంస్కృతిక భిన్నత్వాన్ని, సహనాన్ని ప్రోత్సహించే
దిశగా ఐరాస సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని సమర్థిస్తున్నాం. మత స్వేచ్ఛ,
భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం, శాంతియుతంగా గుమికూడే హక్కు వంటివి పరస్పర
ఆధారితం. మతం, విశ్వాసం ఆధారంగా అసహనం, వివక్షను ఎదుర్కోవడానికి ఇవి
దోహదపడతాయి.
అవినీతి : అవినీతిని ఏ మాత్రం సహించబోం. దీన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ
సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. అవినీతిపై పోరు కోసం ఆస్తుల స్వాధీన
యంత్రాంగాలను పటిష్ఠపరచాలి. నైపుణ్యాలపరంగా ఉన్న వైరుధ్యాలను అధిగమించ డానికి,
అందరికీ మెరుగైన పని కల్పించడానికి, సమ్మిళిత సామాజిక సంరక్షణ విధానాలను
సాకారం చేయాలని నిర్ణయం. ద్వైపాక్షిక, బహుళపక్ష ఒప్పందాల ద్వారా సామాజిక భద్రత
ప్రయోజనాల పోర్టబిలిటీకి ఉన్న అవకాశంపై చర్చించాలి. బాల కార్మిక వ్యవస్థ,
వెట్టిచాకిరీని నిర్మూలించడానికి చర్యలను ముమ్మరం చేయాలి. జాతీయ గణాంక
వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) పరిధిని
విస్తరించడం, ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) జాబ్ డేటాబేస్‌ల ద్వారా
దీన్ని సాధించొచ్చు.