నిర్దేశిత లక్ష్యం కన్నా ఇది రెట్టింపు.. 98శాతం స్వచ్ఛత
నాసా ప్రకటన
వాషింగ్టన్ : అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రయోగం
విజయవంతంగా ముగిసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రకటించింది.
పర్సెవరెన్స్ రోవర్‌లోని మాక్సీ(మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్
యుటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్) పరికరం తుది అంకంగా 16వ సారి ప్రాణవాయువును
ఉత్పత్తి చేసిందని నాసా వెల్లడించింది. ‘‘అరుణ గ్రహంపై ఉండే కార్బన్
డైఆక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే పరీక్ష విజయవంతమైంది. అంగారకుడిపైకి మానవ
సహిత యాత్రలకు ఇది మార్గం సుగమం చేస్తుంది’’ అని నాసా ట్విటర్లో పేర్కొంది. ఆ
సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021లో అంగారకుడిపై దిగినప్పటి నుంచి
ఆక్సిజన్‌ను మాక్సీ ఉత్పత్తి చేస్తోంది. ఈ పరికరం ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియ
ద్వారా అక్కడి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ అణువుల్లోని ఒక్కో ఆక్సిజన్
పరమాణువును వేరు చేసింది. ఆ తర్వాత ఆ వాయువులను విశ్లేషించి ఉత్పత్తి అయిన
ఆక్సిజన్ పరిమాణం, స్వచ్ఛతను పరీక్షించారు. ఈ పరికరం ఇప్పటివరకూ మొత్తం 122
గ్రాముల ప్రాణవాయువును తయారు చేసింది. ఇది ఈ ప్రయోగ నిర్దేశిత లక్ష్యానికి
రెట్టింపు కావడం విశేషం. ఉత్పత్తి అయిన ప్రాణవాయువు 98 శాతం స్వచ్ఛతతో ఉంది.
అంగారకుడిపై వ్యోమగాములు జీవించడానికి, అక్కడి వనరులను వినియోగించుకోవడానికి ఈ
సాంకేతికత వీలు కల్పిస్తుందని నాసా పేర్కొంది. మాక్సీ లాంటి పరికరం ద్వారా
ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను ద్రవీకరించి నిల్వ చేయగలిగే పూర్తిస్థాయి వ్యవస్థ
నిర్మాణంపై తదుపరి దృష్టి పెట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది.