ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికా దేశమైన మొరాకో ప్రకృతి విపత్తుతో
వణికిపోయింది. భూకంప ధాటికి మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ విపత్తులో
ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 820కి చేరింది. మరో 672 మంది గాయపడ్డారని
మొరాకో ప్రభుత్వం వెల్లడించింది. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా
ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా
వేస్తున్నారు. అలాగే భారీ సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. చారిత్రక నేపథ్యం ఉన్న
కట్టడాలు దెబ్బతిన్నాయి.
పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్కు నైరుతి దిశగా 71కిలోమీటర్లు దూరంలో శుక్రవారం
రాత్రి ఈ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.8గా నమోదైందని
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్ హౌజ్,
మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు ఈ భూకంప ధాటికి
వణికిపోయాయి. దాంతో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. ‘అకస్మాత్తుగా భూమి
కంపించడంతో భవనాలు కదిలిపోయాయి. దాంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు
తీశారు. అప్పుడే సరిగ్గా విద్యుత్తు నిలిచిపోయింది. పది నిమిషాల పాటు మేం
అంధకారంలో ఉండిపోయాం. ఏ నెట్వర్క్ పనిచేయలేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు
మీడియాకు వెల్లడించారు.
భూమి కంపిస్తోన్న సమయంలో నేను నిద్రలో ఉన్నాను. నాకు గాల్లోకి ఎగిరిపోయినట్లు
అనిపించింది. దాంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకుపరిగెత్తాను. నది ఒక్కసారిగా
కట్టలు తెంచుకొని ప్రవహించినట్లుగా అనిపించింది. మా ప్రాంతమంతా ఏడుపులు,
కేకలతో నిండిపోయింది’ అని మర్రాకేశ్ స్థానికులు వాపోయారు. దాంతో ప్రభావిత
ప్రాంత ప్రజలంతా రాత్రి ఆరుబయటే ఉండిపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు
కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. దేశం
గతంలో ఎన్నడూ ఈస్థాయి భూకంపాన్ని చూడలేదని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ
ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న అల్జీరియాలో కనిపించింది. అయితే, అక్కడ ఎలాంటి
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. 1980లో అల్జీరియాలో 7.3 తీవ్రతతో తీవ్ర
భూకంపం సంభవించింది. ఆ దుర్ఘటనలో 2500 మంది మరణించగా 3 లక్షల మంది
నిరాశ్రయలుగా మారారు. ఈ ఏడాది తుర్కియే ప్రకృతి ప్రకోపానికి గురైన సంగతి
తెలిసిందే. దాంతో వేలల్లో మరణాలు సంభవించాయి.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి : మొరాకోలో భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ
స్పందించారు. ఈ భూకంపం వల్ల వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై
ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ
క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసిపనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా
ఉందని ప్రకటించారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని జీ20 ప్రారంభోపన్యాసంలో
కూడా మోడీ పిలుపునిచ్చారు.