కోర్సులు, రంగాలు, ‘స్కిల్ గ్యాప్’పై యూనివర్శిటీ ప్రతినిధులతో చర్చలు
మెకాట్రోనిస్, రిటైల్, బ్యూటీ-వెల్నెస్ ల్యాబ్ ల పరిశీలన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటులో భాగంగా సీడాప్
సీఈవో శ్రీనివాసులు పూణెలో పర్యటించారు. ప్రముఖ సింబయాసిస్ నైపుణ్య
విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యువతకు
ఉద్యోగావకాశాలు పెంపొందించడానికి అవసరమైన అత్యాధునిక కోర్సులు, అవకాశాలున్న
రంగాలపై విశ్వవిద్యాలయ యాజమాన్యం, ప్రతినిధులతో సీఈవో ప్రధానంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లో యువత, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన
కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి లక్ష్యంలో భాగంగా యూనివర్శిటీలోని మెకాట్రోనిస్, రిటైల్,
బ్యూటీ-వెల్నెస్ ల్యాబ్ లను ఆయన పరిశీలించారు. క్యాంపస్ లో యువతకు అందించే
నైపుణ్య కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు, ఉత్తమ అభ్యాసాలు, లేటెస్ట్ టెక్నాలజీ ,
డిమాండ్ ఉన్న కోర్సులు, ఉపాధి అవకాశాలు కల్పించే రంగాల వివరాలపైన సింబాయసిస్
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ స్వాతి మజుందార్ ద్వారా వివరాలను అడిగి
తెలుసుకున్నారు. సింబాయసిస్ విశ్వవిద్యాలయం మాత్రమే ప్రత్యేకంగా అందిస్తోన్న
సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ల గురించి అధ్యయనం చేశారు.
ఇంక్యుబేషన్ సెంటర్, అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్, స్కిల్ యూనివర్శిటీ
ఏర్పాటుకు తీసుకున్న ప్రత్యేక ఉత్తమ అభ్యాసాలేంటన్న వివరాలను సీఈవో
శ్రీనివాసులు సేకరించారు. పరిశ్రమల సామాజిక బాధ్యత నిధుల ద్వారా చేపట్టే
నైపుణ్య కార్యక్రమాలను ఆసక్తిగా తెలుసుకున్నట్లు సీడాప్ సీఈవో శ్రీనివాసులు
స్పష్టం చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం స్థాపించాలనుకుంటోన్న
స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడంలో స్థానిక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల
సంఘాలను కూడా కలుపుకోవలసిన ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నట్లు సీఈవో
పేర్కొన్నారు. పూణె సింబాయసిస్ విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరిగిన అధ్యయన
పర్యటనలో సీడాప్ సీఈవో ఎంకేవీ శ్రీనివాసులుతో పాటు, నలుగురు డీఎస్డీవోలు ,
సింబాయసిస్ స్కిల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ స్వాతి మజుందార్ కూడా
పాల్గొన్నారు.