వెనుకబడిన వారికి చెల్లుచీటీ
వారి స్థానాల్లో నూతన సమన్వయకర్తలు
బస్సు యాత్రపై ఆలోచన?
లండన్ నుంచి వచ్చాక కార్యాచరణ
అమరావతి : వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చాక పార్టీ పరంగా కీలక నిర్ణయాలు
తీసుకోబోతున్నారన్న సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేల్ల గుబులు రేపుతోంది.
దీంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబాటుకు గురైన ఎమ్మెల్యేలు
హడావుడిగా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. సీఎం జగన్ లండన్ పర్యటన
ముగించుకుని తిరిగిరాగానే మరోమారు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రాంతీయ
సమన్వయకర్తలతో భేటీ అవుతారని తెలిసింది. ఐ ప్యాక్ ఇచ్చిన నివేదికలు, ప్రాంతీయ
సమన్వయకర్తలకు వచ్చిన వివరాల ఆధారంగా… వెనుకబడిన వివిధ ఎమ్మెల్యేల స్థానంలో
కొత్తగా సమన్వయకర్తల్ని ప్రకటించే అవకాశముంది. ఈ సమన్వయకర్తలే రాబోయే ఎన్నికల
అభ్యర్థులుగా ఉండనున్నారు. పనితీరు మెరుగ్గా ఉండే వారంతా యథాతథంగా
కొనసాగుతారు. సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్న గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమాన్ని ముగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో సీనియర్
మంత్రులు, ఎమ్మెల్యేలంతా హడావుడిగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. విశాఖలో
మంత్రి గుడివాడ అమర్నాథ్, గుడివాడ, మచిలీపట్నంలో మాజీ మంత్రులు పేర్ని
వెంకట్రామయ్య, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ‘గడప గడపకూ మన ప్రభుత్వం’
నిర్వహిస్తున్నారు. వాస్తవంగా మరో 9 నెలల్లోగా ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూలు
ప్రకారమైతే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
కేంద్రం జమిలీ ఎన్నికలకు వెళ్తే మినహా… ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే
పరిస్థితులు లేవు. అలాంటి ఆలోచన కూడా అధికార పార్టీ చేయడంలేదు. ఇప్పటికే
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ప్రజలిచ్చిన ప్రభుత్వాన్ని
చివరి రోజు వరకు ఉపయోగించుకుంటామని ప్రకటించిన విషయం విదితమే. అయినా సీఎం
జగన్ ముందస్తు వ్యూహంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది.
వినూత్న కార్యక్రమానికి సన్నద్ధం : ఇప్పటికే లండన్ పర్యటనలో బిజీబిజీగా
ఉన్నప్పటికీ సీఎం జగన్… పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యకలాపాలపై ఒక
కమిటీ వేసేందుకు ఆదేశించారు. ఇందులో సీఎంవో అధికారులతోపాటు పార్టీ ముఖ్యనేతలు,
సమన్వయకర్తలు ఉంటారు. దీని ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై
నివేదికలు అందజేస్తారు. వాటితోపాటు ఐ ప్యాక్ నివేదికల్ని సరిచూస్తారు. ఇలా
అన్ని విధాలా మెరుగ్గా వచ్చిన వారిని తిరిగి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్
ఇస్తారు. పనితీరు సరిగా లేని వారి స్థానంలో కొత్తగా సమన్వయకర్తల్ని
నియమించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆ సమాచారం కాస్తా
గుప్పుమనడంతో వెనుకబాటుకు గురైన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ఐ ప్యాడ్
నివేదికల ఆధారంగా తమ పనితీరును అంచనా వేయడంపై కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు. సీఎం లండన్ నుంచి రాష్ట్రానికి రాగానే మరో నూతన
కార్యక్రమాన్ని ప్రకటిస్తారనే ప్రచారముంది. ఇప్పటికే విపక్షాలు ప్రభుత్వ
వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి. వచ్చే ఎన్నికలకు
సైతం సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల కోసం
సంప్రదింపులు కొనసాగుతున్నాయి. దీంతో అధికార పక్షం నుంచి సైతం సీఎం వినూత్న
కార్యక్రమాన్ని వెల్లడిస్తారనే ప్రచారముంది. సీఎం జగన్ బస్సు యాత్ర
చేపడతారా?, వెనుకబడ్డామనుకున్న నియోజకవర్గాల్లో పర్యటిస్తారా? అనేదీ స్పష్టం
కావాల్సి ఉంది. దీనిపై వైసీపీ కీలక నేతల నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
సీఎం లండన్ నుంచి తిరిగి వచ్చాకే దానిపై స్పష్టత రానుంది.
టికెట్ల కోసం ఎదురు చూపు : వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశించే వారంతా ముందస్తు
ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలకు పోటీగా టికెట్ల కోసం
దరఖాస్తు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. తమకు కొద్దిపాటి
సన్నిహితంగా ఉన్న వైసీపీలోని పార్టీ ముఖ్యనేతల్ని వారు కలిసి తమకున్న
అవకాశాలను వివరించి… టికెట్ ఇప్పించాలని విన్నవిస్తున్నారు. బయోడేటాలను, వారు
చేసిన కార్యక్రమాల ఫైళ్లను నాయకులకు అందజేస్తున్నారు. కొత్తగా రాజకీయ రంగ
ప్రవేశం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వ్యాపార వేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు
సైతం వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు టికెట్లను ఆశిస్తున్నారు. ఇటీవల
వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ
మంత్రి కోనేరు రంగారావు మనవరాలు కలిసి తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని
అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కుర్చీలో కూర్చోగా… ఆయన
ముందున్న మెట్లపై ఆమె కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపింది. వైసీపీ
ఎమ్మెల్యేలకు చాలా నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలున్నాయి. ప్రస్తుతమున్న
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తే తాము పని చేయబోమంటూ ఆ పార్టీ
ముఖ్యనేతలే బహిరంగంగా చెబుతున్నారు. ప్రకాశంజి ల్లాలో ఇటీవల ఈ సంఘటనలు చోటు
చేసుకోగా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి వెళ్లి అసంతృప్త నేతలను
బుజ్జగించారు. అధికార పార్టీలో ఎన్నికలకు ముందుగానే టికెట్ల విషయంలో నేతల మధ్య
తీవ్ర వైరుధ్యాలు నెలకొనే పరిస్థితులున్నాయి.