విజయవాడ : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ముమ్మాటికి
అప్రజాస్వామికమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. రాబోయే
రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు
అరెస్టు నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా దేవినేనిని పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు. భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఆయన
మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు
చంద్రబాబు అరెస్టుపై ఆందోళన చెందుతున్నారు. కేవలం సీఎం జగన్ రెడ్డి కళ్లలో
ఆనందం కోసమే పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.
రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా వేలాది మంది పోలీసులతో టీడీపీ
నాయకులను నిర్బంధిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు
తప్పదు. తాడేపల్లిలోని సజ్జల పర్యవేక్షణలోనే ఈ అక్రమ గృహ నిర్బంధాలు,
అరెస్టులు జరుగుతున్నాయని విమర్శించారు.
అచ్చెన్నాయుడి గృహనిర్బంధం : చినవాల్తేరులో టీడీపీ ఏపీ అధ్యక్షుడు
అచ్చెన్నాయుడిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయనని ఎవరూ కలవకుండా పోలీసులు
ఆంక్షలు విధించారు.
పథకం ప్రకారమే చంద్రబాబు అరెస్టు: కన్నా లక్ష్మీనారాయణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ
తీవ్రంగా ఖండించారు. ఒక పథకం ప్రకారం చంద్రబాబును అరెస్టు చేశారని
పేర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష
నేతను అరెస్టు చేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.