ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్ : తెలంగాణలో తొమ్మిది వైద్య కళాశాలల ప్రారంభోత్సవాన్ని ఘనంగా
నిర్వహించాలని, 20వేల మందితో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్, బీజేపీ
వైఫల్యాలను ప్రజలకు వివరించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
తెలిపారు. ఈ నెల 15న జనగాం, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల,
కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో
ఒకేసారి 9 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా
జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకచోట కళాశాలను ప్రారంభిస్తారని, కామారెడ్డి
ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారని చెప్పారు. ప్రారంభోత్సవం
సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో 20వేల మందికి తగ్గకుండా భారీ ర్యాలీలు
నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేస్తున్న
మొట్టమొదటి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది. వైద్యకళాశాల ఏర్పాటుతో
ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో అత్యుత్తమ
వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. వైద్యకళాశాలల ప్రారంభంతో కలిగే ప్రయోజనాలు
ప్రజలకు తెలిసేలా కార్యక్రమంలో పెద్దఎత్తున యువత, విద్యార్థులను భాగస్వాములను
చేయాలి. ఆహార ఉత్పత్తిలోనే కాకుండా కీలకమైన వైద్యుల తయారీలోనూ అగ్రస్థానంలో
ఉంది. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు దక్కింది కేవలం రెండు వైద్య
కళాశాలలు మాత్రమే. 157 వైద్య కళాశాలలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు
ఇచ్చింది శూన్యం. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు తీరని అన్యాయం చేసిన
విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇంతకు ముందు తెలంగాణ విద్యార్థులు
వైద్యవిద్య కోసం పక్క రాష్ట్రాలు మొదలు ఉక్రెయిన్, రష్యా వంటి విదేశాలకు
వెళ్లి అనేక కష్టాలు పడేవారు. తెలంగాణ పిల్లలు ఎలాంటి కష్టం లేకుండా
రాష్ట్రంలోనే వైద్యవిద్యను అభ్యసించే గొప్ప సౌకర్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్
కల్పించారు. కొత్త వైద్యకళాశాల ఏర్పాటుతో అందుబాటులోకి రానున్న నూతన
వైద్యసౌకర్యాలను ప్రజలకు వివరించాలి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్
సీట్లలో 43 శాతం తెలంగాణలోనే పెరిగాయని కేటీఆర్ అన్నారు.