న్యూ ఢిల్లీ : శని, ఆదివారాల్లో జరగబోయే జీ-20 సమావేశాల కోసం బ్రిటన్ ప్రధాని
రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. సతీసమేతంగా విచ్చేసిన
ఆయనకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఘన స్వాగతం పలికారు.
జీ-20 దేశాల కూటమి : ప్రభుత్వాల కలయికతో ఏర్పడిన వేదిక. జీ-20లో మొత్తం 19
దేశాలు, యూరోపియన్ యూనియన్ ఉంటాయి. అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం, వాతావరణ
మార్పుల తీవ్రత తగ్గింపు, సుస్థిరాభివృద్ధి వంటి అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు
సంబంధించిన ప్రధాన సవాళ్లను అధిగమించేందుకు ఈ కూటమి పనిచేస్తోంది. ప్రపంచంలో
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు జీ-20 కూటమిలో
ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ దేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థూల ఉత్పాదకతలో
80శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింటి రెండో వంతు,
ప్రపంచ విస్తీర్ణంలో 60శాతంగా ఉన్నాయి.
ప్రపంచ ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో 1999లో జీ-20 దేశాల కూటమి ఏర్పాటైంది.
అయితే 2008 నుంచి ఏడాదికోసారి సమావేశం కావటం ప్రారంభమైంది. సభ్య దేశాల తరఫున
ప్రభుత్వ అధినేత లేదా ఆర్థికమంత్రి లేదా విదేశాంగశాఖ మంత్రి, ఇతర
ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఇతర దేశాలు, అంతర్జాతీయ
ఆర్గనైజేషన్లు, నాన్-గవర్నమెంటల్ సంస్థలను కూడా జీ-20 సదస్సులకు హాజరు కావాలని
ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. కొన్నింటికి శాశ్వత ఆహ్వానం ఉంటుంది.
ఈ ఏడాది రొటేషన్ పద్ధతిలో జీ-20 సదస్సుకు దిల్లీ వేదిక అయింది. గతేడాది
2022లో ఇండోనేషియాలో ఈ సమావేశాలు జరిగాయి. దిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సు
స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించనుంది. అభివృద్ధి చెందిన, వర్ధమాన
దేశాల మధ్య ఆర్థిక ప్రగతిని విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలపై జీ-20 దేశాల
అధినేతలు చర్చించనున్నారు. ఈ సమావేశాల చివరిరోజు భారత్ జీ-20 అధ్యక్ష
బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించనుంది.