న్యూ ఢిల్లీ : జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. భారత్‌కు
విదేశీ ప్రతినిధుల రాక ఇప్పటికే ప్రారంభమైంది. జీ-20 సదస్సును పురస్కరించుకొని
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలువురు
నేతలకు ఆహ్వానం అందినా మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఎలాంటి పిలుపు రాలేదు.
మరోవైపు దేవెగౌడకు ఆహ్వానం అందిన ఆయన రావట్లేదని చెప్పారు.
భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు
సర్వం సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా శనివారం, ఆదివారం జరిగే ఈ సమావేశాలకు కేంద్ర
ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. జీ-20 సదస్సుకు తొలిసారి
ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత సంప్రదాయాలు, సామర్థ్యాలను ప్రపంచానికి
చాటాలని భావిస్తోంది. సమావేశాలు పూర్తైన తర్వాత వెలువడే సంయుక్త ప్రకటనపై
సందిగ్ధం నెలకొంది. అయితే, డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని, ఏకాభిప్రాయం కోసం
చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.
భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా శని, ఆదివారం జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర
సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలను ఎంతో
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం దీని ద్వారా భారత సామర్థ్యాన్ని
ప్రపంచానికి చాటాలని సంకల్పించుకుంది. ఢిల్లీ లోని ప్రగతి మైదానంలో రెండు
రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వంటి
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లు విసిరే పరిణామాలు ఉన్న
ప్రస్తుత సమయంలో ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జీ20 సదస్సుకు మరింత
ప్రాధాన్యం ఏర్పడింది. తొలిసారి ఈ సదస్సును భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో
ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్రం. ఢిల్లీ నగరాన్ని
శత్రుదుర్భేద్యంగా మార్చేసింది.
ఢిల్లీ లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు వచ్చే ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు
అందుకు వేదికైన భారత మండపం ముస్తాబైంది. భారత దేశ విభిన్న సంస్కృతిని తెలిపేలా
ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి కార్యక్రమం కింద తయారు చేసిన హస్తకళలు, కళాఖండాలతో
ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్
సాధించిన పురోగతిని తెలిపేలా చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. దేశంలో
ప్రజాస్వామ్యం పరిణామం చెందిన తీరును ప్రదర్శించే స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
కశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహి నుంచి తెప్పించిన ప్రత్యేక తివాచీలను
ప్రదర్శనలో ఉంచారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వారసత్వ సంపద, సాంస్కృతిక
వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటేలా వేదిక సిద్ధం చేశారు.