వివిధ రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ ఎమ్మెల్యేల వేతనాలు తక్కువ
అలవెన్స్, ఇతర ప్రయోజనాలు కలిపి రూ.1.21 లక్షలు అందుకోనున్న ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు శుభవార్త
చెప్పారు. వారి వేతనాలను నెలకు రూ.40,000 వరకు పెంచుతున్నట్లు గురువారం
ప్రకటించారు. ఇక, ముఖ్యమంత్రి చాలా కాలంగా వేతనం తీసుకోవడం లేదు. ఇందులో
ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ
బెంగాల్ ఎమ్మెల్యేల వేతనాలు చాలా తక్కువనీ, అందుకే వారి వేతనాలను నలభై వేల
రూపాయలు పెంచాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. పెంపు నిర్ణయం ప్రకటన
తర్వాత ఎమ్మెల్యేల వేతనాలు ప్రస్తుతం ఉన్న రూ.10వేల నుండి రూ.50వేలకు
పెరగనున్నాయి. మంత్రుల జీతాలు రూ.10,900 నుండి రూ.50,900కు పెరగనున్నాయి.
కేబినెట్ మంత్రుల వేతనాలు రూ.11వేల నుండి రూ.51వేలకు పెరగనున్నాయి.
అలవెన్స్లు, ఇతర ప్రయోజనాలు అదనం. వాటిని కలుపుకుంటే ఎమ్మెల్యేలకు రూ.1.21
లక్షలు, మంత్రులకు రూ.1.50 లక్షలు అందనున్నాయి.