29 వ డివిజన్ 207 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ సెంట్రల్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో
సంక్షేమ విప్లవం నడుస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే
మల్లాది విష్ణు పేర్కొన్నారు. 29 వ డివిజన్ 207 వ వార్డు సచివాలయ పరిధిలో
గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్
కొంగితల లక్ష్మీపతితో కలిసి ఆయన పాల్గొన్నారు. మధురానగర్లోని సాయిబాబా కాలనీలో
విస్తృతంగా పర్యటించి 272 గడపలను సందర్శించారు. సంక్షేమ పథకాల గురించి ఆరా
తీసేందుకు ఏ ఇంటికి వెళ్లినా ప్రజల్లో సంతోషమే కనపడుతోందని మల్లాది విష్ణు
అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఈ ప్రభుత్వంలో నవరత్నాల వల్ల ఆర్థిక చేయూత
లభిస్తున్నట్లు చెప్పారు. చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా అమలు
పరుస్తూ ప్రతిపక్షాలు కూడా నోరు మెదపలేని విధంగా సంక్షేమాభివృద్ధి
కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అందుకే ప్రజలందరూ
ముఖ్యమంత్రికి జననీరాజనం పలుకుతున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
దూరదృష్టితో తీసుకొచ్చిన పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ గా
నిలిచిందని మల్లాది విష్ణు అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మధురానగర్ ముఖచిత్రంలో పెనుమార్పు : మధురానగర్ ప్రాంతంతో తనకు ప్రత్యేక
అనుబంధం ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. మహానేత వైఎస్
రాజశేఖరరెడ్డి హయాంలో.. తాను ఎమ్మెల్యేగా ఉండగా ఈ ప్రాంతమంతా సిమెంట్ రోడ్లు
వేయించినట్లు పేర్కొన్నారు. సీసీ రహదారులు, యూజిడి, వంతెనల నిర్మాణంతో
మధురానగర్ ముఖచిత్రమే మారిపోయిందన్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ
ప్రాంతం పూర్తి నిర్లక్ష్యానికి గురైందని.. మధురానగర్ అభివృద్ధికి ఒక్క అడుగు
కూడా ముందుకు పడలేదని విమర్శించారు. గత పాలకుల బాధ్యతారాహిత్యం.. ఈ ప్రాంత
ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. మరలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి సారథ్యంలో ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు
మల్లాది విష్ణు పేర్కొన్నారు. సీసీ రోడ్లు, యూజిడి, కర్మల భవన్ సహా అభివృద్ధి
పనులతో ప్రాంత ముఖచిత్రమే మారిపోయిందన్నారు. ఈ అభివృద్ధి రాబోయే రోజుల్లో
ఇదేవిధంగా కొనసాగుతుందని.. ఒక్కో సచివాలయానికి కేటాయించిన రూ. 20 లక్షల నిధులు
ఇందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. కరోనా కారణంగా మధురానగర్ రైల్వే అండర్
బ్రిడ్జి పనులలో కొంత జాప్యం జరిగిందని, డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యేలా
నిరంతర పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు. ఈలోగా
సాయిబాబా కాలనీ వాసులకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. ఒక మినీ బ్రిడ్జి
నిర్మాణాన్ని చేపట్టి అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో
సీడీఓ జగదీశ్వరి, వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు
కంభం కొండలరావు, కోలా రమేష్, అక్బర్, శనగశెట్టి హరిబాబు, చీమల గోవింద్,
దేవినేని సుధాకర్, పూర్ణిమ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.