అమరావతి : ఏపీఎస్ఎస్డీసీ సహకారంతో జర్మనీలో ఉద్యోగావకాశాలు పెంపొందించడమే
లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి 150 మంది
బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు ఎంపికయ్యారు.జర్మనీలో ఉద్యోగాలకు ఎంపికైన 150
మందికి శిక్షణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.అభ్యర్థులు కేవలం వీసా
ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. జర్మనీలో ఉద్యోగంలో చేరిన
తర్వాత ప్రారంభ వేతనం కింద నెలకు 1,000 యూరోలు(సుమారు రూ.89,000)
లభిస్తుండడంతో రోజురోజుకు ఈ శిక్షణకు క్రేజ్ పెరుగుతోంది. అనంతరం జర్మనీలో మరో
6 నెలల శిక్షణను పూర్తి చేస్తే 2,500 యూరోలు (రూ.2.5 లక్షలపైన) జీతం పొందే
అవకాశం ఉంటుందని ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో వినోద్ కుమార్ వెల్లడించారు. సీఎం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు
192 స్కిల్ హబ్స్, 26 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు
చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్ఎస్డీసీ ప్రణాళికలు సిద్ధం
చేస్తోందన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కోసం పది
క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశీ
ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ వేగంగా అడుగులు
వేస్తోంది. విదేశీ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను
తీర్చిదిద్ధి అందించే విధంగా పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలను
కుదుర్చుకుంటోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. టీఏకేటీ
గ్రూప్‌తో ఏపీఎస్ఎస్డీసీ, ఏపీఎన్ఆర్టీఎస్, ఓమ్ క్యాప్ సంయుక్తంగా
నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా 7 మంది జర్మన్ దేశ శిక్షకుల నేతృత్వంలో
ఇప్పటికే 78 మంది నర్సులు బీ1 లెవల్ శిక్షణను పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.