సామాన్యుడి కోసం కాంగ్రెస్ రావాలి
జోడో యాత్రతో ప్రజల గుండె చప్పుడు విన్న రాహుల్
ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవంతంగా భారత్ జోడో యాత్ర
విజయవాడ : సామాన్యుడి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన
చారిత్రాత్మక అవసరం ఉందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి ధర్నా చౌక్ వరకు భారత్ జోడో యాత్ర
నిర్వహించారు. సీడబ్ల్యుసీ సభ్యులు కె.రాజు ముఖ్య అతిధిగా హాజరైన ఈ
కార్యక్రమంలో వందలాది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ర్ట
ప్రధాన కార్యాలయంతో పాటు ఏలూరు రోడ్డు పరిసర ప్రాంతాలన్నీ మూడు రంగుల జెండాలతో
ముస్తాబయ్యాయి. జోడో యాత్ర ముగిసిన అనంతరం ధర్నా చౌక్ లో పీసీసీ అధ్యక్షులు
గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విద్వేష, విభజన
రాజకీయాలు, వాటికి వంతపాడుతున్న రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన వైసీపీ,
తెలుగుదేశం, జనసేనల విధానాలను దుయ్యబట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు
పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ కోట్లాది ప్రజల గుండె చప్పుడు విన్నారని
పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ప్రధానులు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు
చేసిన అభివ్రుద్ధిని ప్రస్తుత ప్రధాని మోడీ ధ్వంసం చేస్తున్నారని ఆవేదన ఆయన
వెలిబుచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి భారాలతో బీజేపీ ప్రభుత్వం ప్రజలను
మరింత పేదరికంలోని నెట్టేసిందని స్పష్టం చేశారు.
విభజించు పాలించు : బీజేపీ ప్రభుత్వం బ్రిటీష్ వారి విభజించు పాలించు
సూత్రాన్ని అనుసరించి దేశ ప్రజలను కులాలు, మతాలు, వర్గాలుగా విభజించి పాలన
సాగిస్తుందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. రాహుల్ తన
4081 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రలో దేశంలోని 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర
పాలిత ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజలతో మమేకమయ్యి వారి కష్ట సుఖాలు
తెలుసుకున్నారని తెలిపారు. దేశంలో దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాలపై దాడులు
పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్, ఉన్నావ్ లాంటి ఘటనలు ఎన్ని
జరిగినా ప్రధాని మోడీ కనీసం స్పందించని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని
స్పష్టం చేశారు. మణిపూర్ బాధితులకు సంఘీభావంగా వెళ్లిన రాహుల్ గాంధీని కూడా
దుర్మార్గంగా అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. పాదయాత్రలో కనీసం సరైన భద్రత
కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని రుద్రరాజు వాపోయారు. రాష్ట్రంలోని
వైసీపీ, తెలుగుదేశం, జనసేన కు మోడీ అంటే భయమని, అందుకే బీజేపీ ఆక్రుత్యాలకు
నోరు మెదపడం లేదన్నారు. త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్
ఘన విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షులు ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా
భారత్ జోడో యాత్ర విజయవంతానికి సహకరించిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు
తెలిపారు.
ప్రత్యేక హాదా, విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ కావాలి : సీడబ్ల్యుసీ సభ్యులు
కొప్పుల రాజు
ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ధికి అత్యావశ్యకమైన ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్,
పోలవరం వంటి వాటి కోసమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని
సీడబ్ల్యుసీ సభ్యులు కొప్పుల రాజు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలు,
అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విజయవాడలో చేపట్టిన భారత్ జోడో
యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు పాదయాత్ర చేస్తే
ప్రాణహాని ఉందని తెలిసినా, ప్రాణాలకు లెక్క చేయకుండా భారత్ జోడోయాత్ర చేసిన
నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. అందరికీ సమ న్యాయం జరగాలన్నా, విభజన హామీలు
అమలవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అందుకే కాంగ్రెస్ బలోపేతానికి
అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు,
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బుర్రా కిరణ్, ఏఐసీసీ సభ్యులు ధనేకుల మురళి, మేడా
సురేష్, కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరావు, ఖాజా మొహిద్దీన్, లీగల్ సెల్
రాష్ట్ర ఛైర్మన్ వి.గుర్నాధం, సేవాదళ్ ఛైర్మన్ యలమందారెడ్డి, లీగల్ సెల్ వైస్
ఛైర్మన్ డాక్టర్ జంధ్యాల శాస్త్రి, సీనియర్ నాయకులు కొల్లు క్రిష్ణ,
నాంచారయ్య, ఎన్ ఎస్ యు ఐ వేముల శ్రీనివాస్ కుర్షీద, పీవై కిరణ్, మన్నం
రాజశేఖర్, ఏసుదాసు, సతీష్, అన్సారీ, బేగ్, ఎండీ గౌస్,యూత్ కాంగ్రెస్ పీటర్,
అన్సారీ, వీరంకి రామచంద్రరావు, నాగూర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.