విజయవాడ సెంట్రల్ : ఆరోగ్యం, ఆత్మరక్షణకు కరాటే, కుంగ్ ఫూ సాధన ఎంతగానో
దోహదపడుతుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు అన్నారు. ఈనెల 3న అజిత్ సింగ్ నగర్లో జరిగిన వైఎస్సార్
మెమోరియల్ 5వ జాతీయ ఓపెన్ కుంగ్ ఫూ అండ్ కరాటే ఛాంపియన్ షిప్ విజయవంతం కావడంతో
కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను కలిశారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు
కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. టోర్నీ
నిర్వహణకు మల్లాది విష్ణు అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా
ఆయనను ఘనంగా సత్కరించారు. ఆపద సమయాలలో తమను తాము రక్షించుకోవడానికి., శారీరక,
మానసిక దృఢత్వానికి ఆత్మరక్షణ విద్య ఉపయోడపడుతుందని మల్లాది విష్ణు అన్నారు.
బాలికలలో ప్రధానంగా కరాటే విద్య ఆత్మస్థైర్యాన్ని పెంపొదిస్తుందన్నారు. అనంతరం
పోటీలలో గెలుపొందిన విద్యార్థులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. నవంబర్
26న జరగబోవు సీనియర్ జాతీయ స్థాయి పోటీలలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
ఆత్మరక్షణ విద్యనభ్యసించే యువతకు తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని
తెలియజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టోర్నమెంట్ చీఫ్ ఇంఛార్జి, వై ఎం కె
అకాడమీ ఫౌండర్ గల్లా రుఫాస్ పాల్, చీఫ్ ఆర్గనైజర్ డి.శ్రీనివాస్, విద్యార్థులు
ఉన్నారు.